
ఆ ఫీలింగ్స్ చెప్పలేకపోతున్నాను: కోహ్లీ
కోల్కతా: 'ఎదురుగా దాదా అన్నయ్య ఉన్నాడు. స్టాండ్స్లో సచిన్ ఉన్నారు. ఇండియా కోసం సచిన్ ఏం చేశారో.. సచిన్ కోసం అభిమానులు ఎంతగా కేకలు పెడతారో నా చిన్నతనం నుంచి చూస్తూ వచ్చాను' అని భారత్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. చాలాకాలం తర్వాత తనకు సచిన్ ముందు ఆడే గొప్ప అవకాశం వచ్చిందని, నా ఆటను చూస్తూ ఆయన ఉత్సాహంగా గడపడం చూశానని అన్నాడు.
సచిన్ నే ఆదర్శంగా తీసుకొని క్రికెట్ లో అడుగుపెట్టిన నాలాంటి యువ క్రీడాకారుడికి సచిన్ ముందే ఆడుతున్న క్షణంలో ఆ ఫీలింగ్స్ వర్ణించడం సాధ్యం కాదని అన్నాడు. సచిన్ ముందే ఆడుతూ, ఆయనకు గొప్పసంతోషాన్నివ్వగలగడం గొప్ప అనుభూతి అని, భావోద్వేగంతో నిండిన సందర్భం అని చెప్పారు. పాకిస్తాన్ తో ఈడెన్ గార్డెన్ మైదానంలో అర్ధ సెంచరీ సాధించి భారత్ కు కీలక విజయాన్ని కోహ్లీ అందించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మైదానంలో బ్యాట్ తో గౌరవ వందనం కూడా చేశాడు.