‘ప్రతిభాన్వేషణ’కు గుర్తింపు
అయ్యప్ప, స్టీఫెన్, భరత్, శ్రీరామ్, భుయ్... గత ఐదేళ్లలో ఆంధ్ర క్రికెట్‌నుంచి వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లలో కొందరు. వీరందరి గుర్తింపు, ఎంపిక వెనక ఎమ్మెస్కే ప్రసాద్ హస్తం ఉంది. 2010లో ప్రారంభమైన ఆంధ్ర క్రికెట్ అకాడమీ అందించిన క్రికెటర్లు వీరు. అంతకు రెండేళ్ల క్రితం 33 ఏళ్ల వయసులో ఇంకా ఆడే సత్తా ఉన్నా... ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ప్రసాద్, ఆ తర్వాత ఆంధ్ర క్రికెట్ అభివృద్ధిలో భాగమయ్యారు. ఏసీఏ డెరైక్టర్ (ఆపరేషన్స్) హోదాలో అనేక కొత్త ప్రణాళికలతో తమ జట్టు రాత మార్చారు.
ప్రతిభ ఉంటే చాలు ఆంధ్ర క్రికెట్‌లో అవకాశం దక్కుతుందనే భావన అన్ని వర్గాల్లో వెళ్లటంలో ఎమ్మెస్కేదే కీలక పాత్ర. సాధారణ నేపథ్యం ఉన్న కుర్రాళ్లను సానబెట్టేందుకు ఏర్పాటు చేసిన మూడు రెసిడెన్షియల్ అకాడమీలు (అండర్-14, అండర్-16, అండర్-19) అతని మార్గదర్శనంలో మంచి ఫలితాలు అందించాయి. గత రెండేళ్లలో ఆంధ్ర రంజీ జట్టును పటిష్టంగా తీర్చిదిద్దడంలో ప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. గత ఏడాది నాకౌట్ దశకు అర్హత సాధించిన ఆంధ్ర, ఈ సారి కూడా నిలకడగా రాణించింది. ఇటీవల ఆంధ్ర మహిళల అండర్-19 జట్టు జాతీయ చాంపియన్‌గా కూడా నిలిచింది.
కొన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభాన్వేషణ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ప్రతిభను ప్రోత్సహించడంలో ఎమ్మెస్కే చురుగ్గా పని చేస్తున్నారు. ఆంధ్ర క్రికెట్‌లో ప్రస్తుతం వేర్వేరు వయో విభాగాల్లో ఉన్న 9 సెలక్షన్ కమిటీల్లో ప్రసాద్ భాగం కావడం విశేషం. గతంలో బోర్డు టెక్నికల్ కమిటీ, ఎన్‌సీఏ కమిటీలో ప్రసాద్ సభ్యుడిగా పని చేశారు. ఎమ్మెస్కే 6 టెస్టులు, 17 వన్డేల్లో భారత్‌కు ప్రాతి నిధ్యం వహించారు. 1999-2000లో సచిన్ సారథ్యంలో ఆస్ట్రేలియా పర్యటించిన భారత జట్టులో ప్రసాద్ సభ్యుడు. 96 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 4021 పరుగులు చేసిన ఈ వికెట్ కీపర్ 239 క్యాచ్‌లు పట్టి, 27 స్టంపింగ్‌లు చేశారు.
అభినందనలు...
సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఎంపికైన ఎమ్మెస్కే ప్రసాద్‌ను ఏపీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అభినందించారు. తెలుగువారికి ప్రసాద్ గర్వకారణంగా నిలిచారని సీఎం పేర్కొన్నారు. గత కొంత కాలంగా ఆంధ్ర క్రికెట్ దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక్కడ సమష్టిగా మేం చేస్తున్న కృషి అందరికీ కనిపిస్తోంది. ఈ కారణాలతోనే సౌత్‌నుంచి మరికొన్ని సీనియర్ ఆటగాళ్ల పేర్లు వచ్చినా...నా పనితీరు గురించి చెప్పి అవకాశం కల్పించిన గోకరాజు గంగరాజుగారికి కృతజ్ఞతలు. ఇక్కడ కేవలం ప్రతిభ మినహా ఎలాంటి సిఫారసులను పట్టించుకోవద్దంటూ ఆయన ఇచ్చిన స్వేచ్ఛ వల్లే ఆంధ్ర క్రికెట్‌నుంచి అనేక మంది కొత్త ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. భారత సెలక్టర్‌గా కూడా సమర్థంగా పని చేసేందుకు ప్రయత్నిస్తా. ఇది నాకో సవాల్‌లాంటిది. ఇప్పుడే చెప్పలేను కానీ మున్ముందు ఆంధ్రనుంచి భారత జట్టుకు ఎక్కువ మంది ఎంపికవుతారని ఆశిస్తున్నా’
-‘సాక్షి’తో ఎమ్మెస్కే ప్రసాద్