లార్డ్స్ : నరాలు తెగే ఉత్కంఠ మధ్య ప్రపంచకప్ మహాసంగ్రామం ముగిసింది. క్రికెట్ పుట్టినింటికే విశ్వకానుక చేరింది. 45 రోజుల ఆట ఏడున్నర గంటల్లో తేలకపోయినా 4 నిమిషాల్లో మెరిసి మురిసింది. తృటిలో టైటిల్ చేజార్చుకున్న న్యూజిలాండ్ మాత్రం అభిమానుల మనుసులను గెలుచుకుంది. ప్రపంచకప్ ఫైనల్ టై కావడమే విశేషం అంటే.. తర్వాత జరిగిన సూపర్ ఓవర్ సైతం టై కావడం సగటు క్రికెట్ అభిమానిని సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. అయితే చివరకు బౌండరీలు మ్యాచ్ ఫలితం తేల్చగా.. కివీస్‌ను మాత్రం నిరాశ పరిచాయి. ఈ తుదిపోరులో ఇంగ్లండ్ సూపర్ ఓవర్‌తో కలుపుకొని 26 బౌండరీలు బాదగా.. కివీస్ మాత్రం 17 బౌండరీలే సాధించింది. దీంతో విశ్వవిజేతగా క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ నిలిచింది.
సూపర్ ఓవర్ టై అయితే ప్రధానమ్యాచ్, సూపర్ ఓవర్ మొత్తం బౌండరీలు లెక్కించి.. ఎక్కవ బౌండరీలు చేసిన జట్టును విజేతగా ప్రకటించారు. మరీ ఆ బౌండరీలు కూడా టై అయితే ఏం చేస్తారు? ఇప్పుడు ప్రతి అభిమాని మదిలో మెదులుతున్న ప్రశ్న. అయితే సూపర్ ఓవర్ నిబంధనల ప్రకారం ఈ పరిస్థితి కనుక ఏర్పడితే.. కేవలం ప్రధాన మ్యాచ్ బౌండరీలను మాత్రమే లెక్కిస్తారు. ఒకవేళ అవి కూడా సమానమైతే.. సూపర్ ఓవర్ చివరి బంతి నుంచి ఇరు జట్లు సాధించిన పరుగులను పరిగణలోకి తీసుకొని ఎక్కువ రన్స్ చేసిన జట్టును విజేతగా ప్రకటిస్తారు.
ఊదాహారణకు...
బంతులు | తొలి జట్టు | రెండో జట్టు |
6వ బంతి | 4 | 4 |
5వ బంతి | 3 | 2 |
4వ బంతి | 6 | 4 |
3వ బంతి |
1 | 2 |
2వ బంతి | 1 | 2 |
1వ బంతి | 1 | 2 |
ఇక్కడ తొలి జట్టు చివరి బంతికి 4 పరుగులు సాధించగా.. రెండో జట్టు కూడా అంతే పరుగులు చేసింది. ఐదో బంతికి తొలి జట్టు 3 పరుగులు చేయగా.. రెండో జట్టు మాత్రం 2 పరుగులే చేసింది. రెండో జట్టు కన్నా ఒక పరుగు ఎక్కువ చేసింది కనుక సూపర్ ఓవర్ నిబంధనల ప్రకారం తొలి జట్టే విజేత అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment