
ఉఫ్... హమ్మయ్య!
ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా ఐదో రోజు ఉదయాన్నే 349 పరుగుల లక్ష్యంతో భారత్‌ను బ్యాటింగ్‌కు పిలిచింది. తొలి రెండు సెషన్లు విరాట్ అండ్ కో ఆచితూచి ఆడి 57 ఓవర్లలో 2 వికెట్లకు 160 పరుగులు చేసి టీ విరామానికి వెళ్లారు. ఇక్కడి నుంచి హై డ్రామా మొదలైంది. ఓ పావుగంట పాటు విజయ్ దడదడలాడించి భారత్ విజయం కోసం ఆడబోతోందని స్పష్టం చేశాడు. ఇక్కడే ఆస్ట్రేలియా బౌలర్లు సత్తా చూపించారు. టపటపా వికెట్లతో భారత్‌ను బెంబేలెత్తించారు. ఫలితం... 217/7. రహానే తప్ప అశ్విన్‌తో సహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా పెవిలియన్‌లో కూర్చున్నారు. విజయం సంగతి దేవుడెరుగు. 12 ఓవర్ల పాటు మూడు వికెట్లు పడకుండా కాపాడుకోవాలి.
హైడ్రామాలకు పెట్టింది పేరైన సిడ్నీలో ఒక్కసారిగా అందరిలోనూ 2008 తలంపులు. క్లార్క్ ఆఖరి ఓవర్లో మూడు వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్ నుంచి లాగేసిన వైనం పదే పదే గుర్తొస్తోంది. ఓవైపు స్మిత్ కొత్త బంతి తీసుకుని ఎదురుదాడి మొదలుపెట్టాడు. రహానేకు జతగా భువనేశ్వర్... ప్రతి బంతికీ ఉత్కంఠ. ఉఫ్... హా... అయ్యో... ఇలాంటి నిట్టూర్పులు. మొత్తంమీద చివరి గంటలో సిడ్నీలో నరాలు తెగే ఉత్కంఠ. ఈ ఒత్తిడిని రహానే, భువనేశ్వర్ అద్భుతంగా అధిగమించారు. చుట్టూ ఫీల్డర్లు మోహరించినా... ధైర్యంగా మరో వికెట్ పడకుండా పోరాడి భారత్‌ను గట్టెక్కించారు. ఫలితంగా నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యం 2-0కు మించి పెరగకుండా చూశారు.
సిడ్నీ: సమయానుకూలంగా ఆటతీరును మార్చుకుంటూ పోరాట స్ఫూర్తిని చూపెట్టిన భారత్ జట్టు... ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టును డ్రాగా ముగించింది. చివరి సెషన్‌లో టపటపా వికెట్లు పడినా.. రహానే (38 నాటౌట్), భువనేశ్వర్ (20 నాటౌట్) సహనంతో బ్యాటింగ్ చేసి జట్టును గట్టెక్కించారు. సిడ్నీ మైదానంలో శనివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో... 349 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 89.5 ఓవర్లలో 7 వికెట్లకు 252 పరుగులు చేసింది.
విజయ్ (165 బంతుల్లో 80; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లి (95 బంతుల్లో 46; 3 ఫోర్లు), రోహిత్ (90 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు)లు రాణించారు. స్టార్క్, లయోన్, హాజెల్‌వుడ్ తలా రెండు వికెట్లు తీశారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 251/6 వద్దే ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ముక్కోణపు వన్డే టోర్నీ 16 నుంచి జరుగుతుంది.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 572/7 డిక్లేర్డ్
భారత్ తొలి ఇన్నింగ్స్: 475 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 251/6 డిక్లేర్డ్
భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ (సి) హాడిన్ (బి) హాజెల్‌వుడ్ 80; రాహుల్ (సి) వార్నర్ (బి) లయోన్ 16; రోహిత్ (సి) స్మిత్ (బి) వాట్సన్ 39; కోహ్లి (సి) వాట్సన్ (బి) స్టార్క్ 46; రహానే నాటౌట్ 38; రైనా ఎల్బీడబ్ల్యూ (బి) స్టార్క్ 0; సాహా ఎల్బీడబ్ల్యూ (బి) లయోన్ 0; అశ్విన్ ఎల్బీడబ్ల్యూ (బి) హాజెల్‌వుడ్ 1; భువనేశ్వర్ నాటౌట్ 20; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: (89.5 ఓవర్లలో 7 వికెట్లకు) 252.
వికెట్ల పతనం: 1-48; 2-104; 3-178; 4-201; 5-203; 6-208; 7-217
బౌలింగ్: స్టార్క్ 19-7-36-2; హారిస్ 13-3-34-0; లయోన్ 30.5-5-110-2; హాజెల్‌వుడ్ 17-7-31-2; స్మిత్ 2-0-7-0; వాట్సన్ 8-2-22-1
సెషన్-1: విజయ్ జోరు
లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన విజయ్, లోకేశ్ రాహుల్ (16) నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. కొత్త బంతిని ఆచితూచి ఆడటంతో తొలి ఏడు ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే చేశారు. పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో ఆరో ఓవర్‌లోనే లయోన్‌కు స్మిత్ బంతి అప్పగించాడు. అయితే పదో ఓవర్‌లో విజయ్ చెలరేగి 16 పరుగులు రాబట్టడంతో భారత్ స్కోరు కాస్త వేగంగా కదిలింది.
కానీ రెండో ఎండ్‌లో బాగా ఇబ్బందిపడ్డ రాహుల్ 14వ ఓవర్‌లో లయోన్ బంతిని వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన రోహిత్ ఎదుర్కొన్న తొలి బంతికే స్టంప్ అవుటయ్యే అవకాశం నుంచి తప్పించుకున్నాడు. తర్వాత 6.4 ఓవర్ల వరకు ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. చివరకు 24వ ఓవర్‌లో ఓ భారీ సిక్స్, బౌండరీతో గాడిలో పడ్డాడు. తర్వాత ఈ జోడి లంచ్ వరకు ఎలాంటి తడబాటు లేకుండా ఆడింది.
ఓవర్లు: 29; పరుగులు: 73; వికెట్లు: 1
సెషన్-2 : కోహ్లి నిలకడ
లంచ్ తర్వాత విజయ్, రోహిత్ నిలకడగా ఆడినా భారీ భాగస్వామ్యాన్ని మాత్రం నమోదు చేయలేకపోయారు. విరామం తర్వాత 9వ ఓవర్‌లో రోహిత్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో డైవ్ చేస్తూ స్మిత్ ఒంటిచేత్తో అద్భుతంగా అందుకున్నాడు. విజయ్, రోహిత్ రెండో వికెట్‌కు 56 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన కోహ్లి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇన్నింగ్స్‌ను సాఫీగా నడిపించాడు. దీంతో భారత్ 37వ ఓవర్‌లో వంద పరుగులకు చేరుకుంది.
అయితే 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విజయ్ ఇచ్చిన క్యాచ్‌ను షార్ట్ కవర్‌లో మార్ష్ వదిలేశాడు. తర్వాతి ఓవర్‌లోనే మరోసారి ఎల్బీ నుంచి తప్పించుకున్నాడు. విజయ్ అవుటైనట్లు రీప్లేలో స్పష్టమైనా అంపైర్ సంతృప్తి చెందలేదు. కొద్దిసేపటికే విజయ్ 135 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో అతనికిది నాలుగోది. ఈ జోడి నిలకడతో భారత్ 160/2 స్కోరుతో టీకి వెళ్లింది.
ఓవర్లు: 28; పరుగులు: 87; వికెట్లు: 1
సెషన్-3: బౌలర్ల హవా
ఇక చివరి సెషన్‌లో భారత్ గెలవాలంటే 189 పరుగులు చేయాలి. చేతిలో ఎనిమిది వికెట్లున్నాయి. క్రీజులో ఉన్న విజయ్, కోహ్లి మంచి జోరుమీదున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకున్న టీమిండియాకు ఆసీస్ బౌలర్లు ఊహించని షాక్ ఇచ్చారు. నిలకడగా ఆడుతున్న విజయ్‌ను 61వ ఓవర్‌లో హాజెల్‌వుడ్ బోల్తా కొట్టించాడు. దీంతో మూడో వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. అప్పుడే వచ్చిన రహానే కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్నాడు.
కానీ భారత్ స్కోరు 200లకు చేరిన వెంటనే కోహ్లి, ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో రైనా (0), సాహా (0)లు వెనుదిరి గారు. ఓవరాల్‌గా 7 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు చేజార్చుకోవడంతో భారత్ గెలుపుపై ఆశలు వదిలేసుకుంది. ఇక మ్యాచ్‌ను కాపాడే బాధ్యత రహానేపై పడింది. అశ్విన్‌తో కలిసి 7.1 ఓవర్లు బ్యాటింగ్ చేసి కేవలం 9 పరుగులు జోడించారు. అయితే 79వ ఓవర్‌లో అశ్విన్ అవుట్ కావడంతో భారత్ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఈ దశలో భువనేశ్వర్ ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. అత్యంత కీలకమైన 69 బంతులను ఓర్పుతో ఎదుర్కొన్న ఈ జంట ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 35 పరుగులు జోడించి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.
ఓవర్లు: 32.5; పరుగులు: 92; వికెట్లు: 5
3113 నాలుగు టెస్టుల్లో కలిపి ఆసీస్ చేసిన పరుగులు. గతంలో దక్షిణాఫ్రికా 2962 పరుగుల రికార్డును స్మిత్ సేన అధిగమించింది.
692 ఈ సిరీస్‌లో కోహ్లి చేసిన పరుగులు. ఆసీస్‌లో ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. కానీ ఏ సిరీస్‌లోనైనా ఎక్కువ పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్ విరాట్. గతంలో గవాస్కర్ రెండుసార్లు విండీస్‌పై 700కు పైగా పరుగులు చేశాడు.
482 ఈ సిరీస్‌లో మురళీ విజయ్ చేసిన పరుగులు. ఆస్ట్రేలియాలో భారత్ తరఫున ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌కు ఇదే అత్యధికం.
2 గత 20 ఏళ్లలో సిడ్నీలో డ్రా అయిన టెస్టుల సంఖ్య. ఈ కాలంలో 22 టెస్టులు ఆడితే ఆసీస్ 17 గెలవగా, మూడింటిలో ఓడింది.
5 చివరి ఏడు ఇన్నింగ్స్‌ల్లో రైనా ఐదుసార్లు డకౌటయ్యాడు. అలాగే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌట్ కావడం ఇది రెండోసారి. 2011 ఓవల్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌట్ అయ్యాడు.
ఓటమంటే నాకు అసహ్యం. పోటీ ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాం. ప్రత్యర్థులు ఈ విషయాన్ని గ్రహించి మాకు సరైన గౌరవం ఇవ్వాలి. కుర్రాళ్లమని తేలికగా తీసిపారేయకూడదు. అలా ఆలోచించడం వారికే మంచిదికాదు. మేం ప్రపంచకప్‌ను గెలవబోతున్నాం. ఆ నమ్మకం మాకుంది. ఆసీస్‌లో మేం మంచి క్రికెట్ ఆడాం. ఈ అనుభవం మాకు వరల్డ్‌కప్‌లో ఉపయోగపడుతుంది.
అంతర్జాతీయ స్థాయిలో బౌలింగ్ ఎలా చేయాలో ఆసీస్‌ను చూసి నేర్చుకోవాలి. నేను అవుటయ్యే వరకు విజయం కోసం ప్రయత్నించి చూడాలనుకున్నాం. మా ఆటగాళ్లు కూడా బాగా ఆడారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఇంకా నిలకడ రావాలి. మాటల యుద్ధం సహజం. కానీ ప్రత్యర్థులు మమ్మల్ని గౌరవించడం నేర్చుకోవాలి. సిరీస్‌లో ఓడినా వ్యక్తిగతంగా నాకు సానుకూల ఫలితాన్నే ఇచ్చింది. నాపై నమ్మకం ఉంది కాబట్టి ఎక్కువగా ఒత్తిడి తీసుకోలేదు. ఇక టెస్టులను మర్చి వన్డేలపై దృష్టిపెడతాం. -కోహ్లి (భారత కెప్టెన్)
ఈ సిరీస్‌లో 20 వికెట్లు తీయడం చాలా కష్టంగా మారింది. మేం ఊహించిన విధంగా పిచ్‌లు లేవు. లేకపోతే సిరీస్‌ను ఇంకా మెరుగైన ఆధిక్యంతో గెలిచేవాళ్లం. నాలుగు టెస్టుల్లో బౌలర్లు బాగా కష్టపడ్డారు. ఐదో రోజు భారత్‌ను ఆలౌట్ చేయకపోవడం కాస్త నిరాశ కలిగించింది. గెలిచి ఉంటే బాగుండేది.
లయోన్ కొన్ని అవకాశాలను సృష్టించినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాం. బావోద్వేగాల మధ్య ఈ సిరీస్ ఆడటం బాగా కష్టమైంది. అయినప్పటికీ సిరీస్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. కెప్టెన్సీని బాగా ఆస్వాదించా. అద్భుతమైన జట్టుకు నాయకత్వం వహించా. సీనియర్లు బాగా సహకరించారు. నేను కోరుకున్న విధంగా ఆటగాళ్లు రాణించారు.
-స్మిత్ (ఆసీస్ కెప్టెన్)