ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న కీలకమైన రెండో వన్డేలో రెండు మార్పులతో బరిలోకి దిగింది టీమిండియా. కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీలను రెండో వన్డే నుంచి తప్పించి వారి స్థానాల్లో చహల్, సైనీలకు అవకాశం ఇచ్చింది. కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో కుల్దీప్ రెండు వికెట్లు సాధించినా 10 ఓవర్లలో 84 పరుగులు సమర్పించుకుని చెత్త గణాంకాలను నమోదు చేశాడు. ఒక వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులిచ్చిన మూడో స్పిన్నర్‌గా చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. దాంతో కుల్దీప్‌కు రెండో వన్డేలో ఉద్వాసన తప్పదని ముందే ఊహించారు. అయితే ఇక్కడ ప్రధాన పేసర్ మహ్మద్ షమీని రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేయడం ఏమిటనేదే ప్రశ్న. గత మ్యాచ్‌లో షమీ 9.1 ఓవర్లలో 63 పరుగులిచ్చి ఒక వికెట్ సాధించాడు.
ఇక్కడ శార్దూల్ ఠాకూర్ కంటే షమీ ప్రదర్శనే మెరుగ్గా ఉంది. శార్దూల్ 9 ఓవర్ల బౌలింగ్‌లో వికెట్ తీసి 80 పరుగులిచ్చాడు. ఆ మ్యాచ్ భారత్ ఇన్నింగ్స్‌లో కుల్దీప్ తర్వాత భారీగా పరుగులు ఇచ్చింది శార్దూలే. మరి శార్దూల్‌ను రెండో వన్డేలో కొనసాగించడానికి మొగ్గుచూపిన మేనేజ్‌మెంట్.. షమీని మాత్రం పక్కకు పెట్టింది. శార్దూల్ కంటే ఎంతో అనుభవం ఉన్న షమీకి తుది జట్టులోకి తీసుకోలేదు. శార్దూల్‌ను తప్పించి నవదీప్ సైనీకి అవకాశం కల్పిస్తే భారత్ బౌలింగ్ మరింత పటిష్టంగా ఉండేది. ఇది టీమిండియాకు ఎంతో ముఖ్యమైన మ్యాచ్. ఇందులో గెలిస్తేనే రేసులో నిలుస్తోంది. అటువంటిది షమీకి విశ్రాంతి ఇచ్చారు. టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకునే షమీకి విశ్రాంతి ఇచ్చామని కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత్ వెనుకబడే ఉంది. దాంతో షమీని తప్పించడం కచ్చితంగా కీలక నిర్ణయమే. షమీ స్థానంలో జట్టులోకి వచ్చిన సైనీ, గత మ్యాచ్‌లో భారీ పరుగులిచ్చిన శార్దూల్‌లు మేనేజ్‌మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడితే ఫర్వాలేదు కానీ వీరిద్దరూ ఎటువంటి ప్రభావం చూపకపోయి మ్యాచ్‌ను చేజార్చుకుంటే మాత్రం విమర్శలు వర్షం కురిసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment