దాదాపు రెండున్నరేళ్ల క్రితం భారత్‌లో టి20 ప్రపంచకప్ సెమీఫైనల్. విరాట్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియా 193 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక మనదే విజయం అనుకున్నారంతా! కానీ, ఒత్తిడిని తట్టుకుని వెస్టిండీస్ భీకర హిట్టింగ్‌తో లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదేసింది. ఆనాటి టి20 మ్యాచ్‌ను... వన్డే స్వరూపంలో ఆడిస్తే ఊహకు ఎలా ఉంటుందో అచ్చం అలాగే సాగింది బుధవారం నాటి విశాఖపట్నం మ్యాచ్. కాకపోతే నాడు అలవోక విజయం సాధించిన విండీస్... నేడు త్రుటిలో దానిని చేజార్చుకుని ‘టై’తో సంతృప్తి పడింది. ఛేదనలో తొలుత కొంత తడబడినా... హెట్‌మైర్ మెరుపులు, షై హోప్ నిలకడతో నిలిచిన పర్యాటక జట్టు అందివచ్చిన గెలుపును ఒడిసి పట్టలేకపోయింది. కోహ్లి 10వేల పరుగుల మైలురాయిని దాటిన ఈ మ్యాచ్‌లో భారత్ పరాజయాన్ని తప్పించుకుంది.
సాక్షి, విశాఖపట్నం: పరాజయ పరంపర నుంచి వెస్టిండీస్‌కు ఉపశమనం. అయితే, అది గెలుపుతో మాత్రం కాదు! ‘టై’తో దక్కిన ఊరట. బుధవారం ఇక్కడి డాక్టర్ వైఎస్‌ఆర్ ఏసీఏ–వీడీసీఏ మైదానంలో భారత్‌తో జరిగిన రెండో వన్డేలో ఆ జట్టు పోరాడి ఓటమిని తప్పించుకుంది. శతకాల రారాజు, కెప్టెన్ విరాట్ కోహ్లి (129 బంతుల్లో 157 నాటౌట్; 13 ఫోర్లు, 4 సిక్స్‌లు) రికార్డుల వేటకు వేదికగా నిలిచిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. తెలుగు తేజం అంబటి రాయుడు (80 బంతుల్లో 73; 8 ఫోర్లు) అర్ధ శతకంతో సారథికి అండగా నిలిచాడు. ఛేదనలో వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ షై హోప్ (134 బంతుల్లో 123 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ ఇన్నింగ్స్‌కు, యువ హెట్‌మైర్ (64 బంతుల్లో 94; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) విజృంభణ తోడవడంతో వెస్టిండీస్ దీటుగా బదులిచ్చింది. అయితే, చివర్లో తడబడి ఏడు వికెట్లకు 321 పరుగుల వద్ద ఆగిపోయింది. కుల్దీప్ (3/67) మూడు వికెట్లతో రాణించగా... షమీ, ఉమేశ్, చహల్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. కెరీర్‌లో 37వ శతకం చేసిన కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రెండు జట్ల మధ్య మూడో వన్డే శనివారం పుణెలో జరుగుతుంది.
వారిద్దరి సమన్వయం
భారత ఇన్నింగ్స్ ఆసాంతం కోహ్లి, రాయుడు చుట్టూనే సాగింది. ఆడిన బంతులు (209), కలిపి చేసిన పరుగుల (230) గణాంకాల ప్రకారం చెప్పాలంటే 70 శాతం ఆటను వీరిద్దరే నడిపించారు. మధ్య ఓవర్లలో బ్యాటింగ్ చేయడం ఎలానో చెబుతూ, స్కోరు బోర్డును నడిపించడం ఎలానో చూపుతూ జట్టుకు పరుగులందించింది ఈ జోడీ. దీనికిముందు టీమిండియాకు మరోసారి శుభారంభం దక్కలేదు. గత మ్యాచ్ శతక వీరుడు రోహిత్ (4) నాలుగో ఓవర్లోనే వెనుదిరిగ్గా... ధావన్ (30 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్) కొద్దిసేపు నిలిచాడు. చక్కటి షాట్లతో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన అతడు నర్స్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయి భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అయితే, కోహ్లి, రాయుడు బాధ్యతనంతటినీ భుజాన వేసుకున్నారు. ఓవైపు స్ట్రయిక్ రొటేట్ చేస్తూ, మరోవైపు రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంటూపోయారు. వీలున్నప్పుడల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలో మెకాయ్ బౌలింగ్‌లో సింగిల్‌తో తొలుత కోహ్లి (56 బంతుల్లో), అనంతరం బౌండరీతో రాయుడు (61 బంతుల్లో) అర్ధశతకాలు అందుకున్నారు. ఇక్కడినుంచి జోరు చూపిన రాయుడు కోహ్లిని దాటుకుని చకచకా 70ల్లోకి వెళ్లిపోయాడు. కానీ, నర్స్ ఓవర్లో స్వీప్‌నకు యత్నించి బౌల్డయ్యాడు. దీంతో మూడో వికెట్‌కు 139 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
కెప్టెన్‌కు జత కలిసిన ధోని (20) ఓ సిక్స్ బాది అలరించాడు. కానీ, మెకాయ్ స్లో బంతి అతడి వికెట్లను పడగొట్టింది. రిషభ్ పంత్ (17) మెరుపులు మెరిపించలేకపోయాడు. ఈ రెండు వికెట్లు కోల్పోవడానికి మధ్యలోనే 90ల్లోకి వచ్చిన కోహ్లి... 44 ఓవర్లో శామ్యూల్స్ వేసిన బంతిని కవర్స్‌లో బౌండరీకి పంపి 37వ శతకాన్ని (106 బంతుల్లో) సాధించాడు. అంతకుముందు 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను విండీస్ కెప్టెన్ హోల్డర్ వదిలేశాడు. దానికి విండీస్ భారీ మూల్యమే చెల్లించు కుంది. జీవనదానం తర్వాత కోహ్లి మరో 113 పరుగులు చేయడం విశేషం. సెంచరీ తర్వాత చెలరేగి ఆడిన కోహ్లి మెకాయ్, రోచ్‌ల బౌలింగ్‌లో 9 బంతుల వ్యవధిలో మూడు సిక్స్‌లు, ఫోర్ సహా 32 పరుగులు పిండుకుని జట్టు స్కోరును 300 దాటించాడు. అయితే, 49వ ఓవర్‌లో మెకాయ్ ఐదు పరుగులే ఇచ్చి జడేజా (13) వికెట్ తీశాడు. ఆఖరి ఓవర్లో స్ట్రయికింగ్ తీసుకున్న కోహ్లి... స్వభావానికి భిన్నంగా స్కూప్ షాట్‌తో బౌండరీ కొట్టి ఆశ్చర్యపరిచాడు. అనంతరం 2 పరుగులతో 150 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. వెంటనే లాంగాన్ లో సిక్స్ కొట్టాడు.
‘హిట్’మైర్‌భయపెట్టాడు... ‘హోప్’ నిలిపాడు
గత మ్యాచ్‌లో తాము విధించిన లక్ష్యానికి దాదాపు సమానమైన స్కోరును ఛేదించేందుకు దిగిన విండీస్‌కు ఓపెనర్లు కీరన్ పావెల్ (18), హేమ్‌రాజ్ (32, 6 ఫోర్లు) శుభారంభం ఇచ్చారు. అయితే షమీ... పావెల్‌ను ఔట్ చేసి ప్రమాదం తప్పించాడు. బౌండరీలతో దూకుడు మీదున్న హేమ్‌రాజ్, శామ్యూల్స్ (13)లను కుల్దీప్ బౌల్డ్ చేశాడు. 78/3తో నిలిచి... చేతులెత్తేస్తుంద నుకున్న జట్టును హోప్, హెట్‌మైర్ మళ్లీ పోటీలో నిలిపారు. ముఖ్యంగా హెట్‌మైర్ ఎడాపెడా సిక్స్‌లు కొట్టాడు. తనకంటే ముందు దిగిన హోప్‌ను దాటిపోయి అర్ధశతకం (41 బంతుల్లో) పూర్తి చేశాడు. తర్వాత మరింత రెచ్చిపోయి చహల్ ఓవర్లో ఫోర్, 2 సిక్స్‌లు బాదాడు. హోప్ సైతం 64 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ జోడీ జోరుతో విండీస్ 30వ ఓవర్లోనే 200 స్కోరు దాటింది. సాధించాల్సిన రన్‌రేట్ 5కు చేరిన నేపథ్యంలో ఆ జట్టు విజయం ఖాయం అనిపించింది. కానీ హెట్‌మైర్ భారీ షాట్‌కు ప్రయ త్నించి కవర్స్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చాడు. పావెల్‌ను కుల్దీప్ అవుట్ చేసి మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చాడు. హోప్ శతకం (113 బంతుల్లో) చేసి క్రీజులో ఉన్నా అనవసర పరుగుకు యత్నించి కెప్టెన్ హోల్డర్ (12) ఔటవ్వడం జట్టును మరింత ఇబ్బందుల్లో పడేసింది. చివరి మూడు ఓవర్లలో 22 పరుగులు చేయాల్సిన స్థితిలో 48, 49వ ఓవర్లలో చహల్ 2, షమీ 6 పరుగులు మాత్రమే ఇచ్చారు. చివరి ఓవర్‌లో ఉమేశ్ 13 పరుగులు ఇచ్చాడు. ఆఖరి బంతికి విజయం కోసం 5 పరుగులు చేయాల్సి ఉండగా హోప్ ఫోర్ కొట్టడంతో మ్యాచ్ టై అయ్యింది.
►2 భారత్, విండీస్ జట్ల మధ్య ‘టై’ అయిన మ్యాచ్‌ల సంఖ్య. తొలి ‘టై’ 1991లో డిసెంబరు 6న పెర్త్‌లో ముక్కోణపు సిరీస్‌లో చోటు చేసుకుంది. ఆ మ్యాచ్‌లో తొలుత భారత్... అనంతరం విండీస్ 121 పరుగులకు ఆలౌటయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment