కుర్రాళ్ల చివరి మ్యాచ్ ‘టై’
భారత్ అండర్–19 జట్టుదే వన్డే సిరీస్
ముంబై: భారత్, ఇంగ్లండ్ అండర్–19 జట్ల మధ్య జరిగిన ఐదో వన్డే ‘టై’ అయింది. దీంతో 3–1తో సిరీస్‌ను యువ భారత్ జట్టు కైవసం చేసుకుంది. వాంఖెడే స్టేడియంలో బుధవారం ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ చివరి బంతికి ఒక పరుగు చేస్తే గెలిచే స్థితిలో ఉండగా... తీవ్ర ఒత్తిడికి లోనైన ఇషాన్ పోరెల్ (6) ప్యాటర్‌సన్ వైట్ బౌలింగ్‌లో కీపర్ హోల్డెన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో భారత్ గెలవాల్సిన మ్యాచ్ ‘టై’గా ముగిసింది. మొదట ఇంగ్లండ్ జూనియర్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 226 పరుగులు చేసింది. బర్ట్‌లెట్ (47; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఒలీ పోప్ (45; 2 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో ఆయుష్ 3, ఇషాన్ పోరెల్ 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ కూడా 50 ఓవర్లలో సరిగ్గా 226 పరుగులే చేసి ఆలౌటైంది.
రాధాకృష్ణన్ (65; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. 137 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును ఆయుష్ (40; 4 ఫోర్లు, ఒక సిక్స్), యశ్ ఠాకూర్ (30; 2 ఫోర్లు) ఆదుకున్నారు. ఎనిమిదో వికెట్‌కు 65 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే చివర్లో వీరిద్దరూ వెంటవెంటనే అవుటవ్వడం... ఆఖరి బంతికి ఇషాన్ కూడా నిష్క్రమించడంతో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రూక్స్ 3 వికెట్లు తీయగా, బ్లాతెర్‌విక్, గాడ్సల్, రాలిన్స్ తలా 2 వికెట్లు పడగొట్టారు.