ముంబై: సరిగ్గా ఏడాది క్రితం న్యూజిలాండ్ జట్టు భారత గడ్డపై వన్డే సిరీస్‌లో తలపడింది. ఆ సిరీస్‌ను భారత్ 3–2తో సొంతం చేసుకుంది. ఇప్పుడు సంవత్సరం తర్వాత దాదాపుగా ఆ ఆటగాళ్లతోనే ఇరు జట్లు మళ్లీ పోరుకు సిద్ధమయ్యాయి. కాబట్టి వ్యూహాల్లో కూడా కొత్తగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదని భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. మూడు వన్డేల సిరీస్ ఆదివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం రోహిత్ మీడియాతో మాట్లాడాడు.
‘గత ఏడాది ఇదే సమయంలో న్యూజిలాండ్‌ను ఎదుర్కొన్నాం. ఆ సిరీస్‌లో ఆడిన ఎక్కువ మంది ఆటగాళ్లు రెండు జట్లలోనూ ఇప్పుడూ ఉన్నారు. కాబట్టి నా దృష్టిలో వ్యూహాలు, ప్రణాళికలకు సంబంధించి మరీ పెద్దగా మార్పేమీ రాదని నేను భావిస్తున్నా. బౌల్ట్‌తో సహా వారి బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. అయితే ఆయా బౌలర్ల గురించి మాకు మంచి అవగాహన ఉండటం కలిసొచ్చే అంశం.
సంవత్సరం వ్యవధిలో నా ఆటలోనూ మార్పేమీ రాలేదు కానీ వైస్ కెప్టెన్‌గా కాస్త బాధ్యత మాత్రం పెరిగింది. లెఫ్టార్మ్ పేస్ బౌలర్లను ఎదుర్కోవడంలో మేం ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. అదే తరహా బౌలరైన ట్రెంట్ బౌల్ట్‌ను సమర్థంగా ఆడటం మాకు సవాల్‌లాంటిదే. ఈ విషయంలో కివీస్ ప్రత్యేకంగా కనిపిస్తోంది. భారత్ తరఫున ఒక లెఫ్టార్మ్ పేసర్ (జహీర్) ఆడి చాలా ఏళ్లు గడిచిపోయిన విషయం మరచిపోవద్దు’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.
అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో...
ఆసీస్‌తో చివరి టి20 మ్యాచ్ రద్దయిన తర్వాత భారత ఆటగాళ్లకు ఆరు రోజుల పాటు విశ్రాంతి లభించింది. విరామం తర్వాత కివీస్‌తో తొలి మ్యాచ్‌కు ముందు శుక్రవారం జట్టు సభ్యులంతా వాంఖడే మైదానంలో ప్రాక్టీస్ సెషన్‌కు హాజరయ్యారు. హెడ్ కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో సుదీర్ఘ సమయం పాటు సాధన చేశారు.
భారత ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బౌలింగ్ విభాగంలో క్రికెట్ దిగ్గజం సచిన్ కుమారుడు, 18 ఏళ్ల అర్జున్ టెండూల్కర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. గతంలోనూ లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ జట్ల ప్రాక్టీస్ సెషన్‌లలో నెట్ బౌలర్‌గా అతను అనేక సార్లు బంతులు వేశాడు. అయితే ముంబైలో భారత జట్టుతో కలిసి సాధన చేయడం మాత్రం ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment