
ఎందుకీ అసహనం..?
ఓటమి గురించి అడిగితే మా కుక్క పిల్లకు జ్వరం వచ్చిందనే క్రికెటర్ ఒకరు...
► అదుపు తప్పుతున్న భారత క్రికెటర్లు
► అర్థం లేని స్పందనలు
ఓటమి గురించి అడిగితే మా కుక్క పిల్లకు జ్వరం వచ్చిందనే క్రికెటర్ ఒకరు... రాజకీయాల గురించి అడిగితే నీకు బుద్ధి లేదనేవారొకరు... కోచ్ గురించి అడిగితే పెళ్లామా, పక్కింటావిడా అని ప్రశ్నించేదొకరు... రిటైర్మెంట్ గురించి ప్రశ్నిస్తే మీ ఇంట్లో ఎవరున్నారు అనేదొకరు...
ఇవన్నీ చూస్తుంటే మన క్రికెటర్లలో ఇటీవలి కాలంలో అసహనం బాగా పెరిగిపోతున్నట్లు అనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక రకమైన ‘ట్రెండ్’ను వీరు మొదలు పెడుతున్నారు. ప్రశ్న ఒకటి అయితే దానికి పొంతన లేని సమాధానం ఇస్తూ తమ తెలివితేటలు ప్రదర్శిస్తున్నారా లేక ఏం చెప్పినా చెల్లుతుందనే అహంతో అలా ప్రవర్తిస్తున్నారా!
ఆటతోనే కాదు మాటలతో కూడా గారడీ చేయడం భారత వన్డే, టి20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి వెన్నతో పెట్టిన విద్య. చాలా సందర్భాల్లో అతని మాటలు త్రివిక్రమ్ డైలాగుల్లా పేలతాయి. సూటిగా తన అభిప్రాయం చెబుతూనే, సరదాగా నవ్వులు తెప్పించే విధంగా కూడా ఆ మాటలు ఉండేవి. అయితే అతనిలో కూడా అసహనంపాలు పెరిగినట్లే అనిపిస్తోంది. వరల్డ్ కప్‌కు ముందు రిటైర్మెంట్ గురించి అడిగితే కాస్త ఆగ్రహంగానే ‘నేను ఒక్కసారి చెబితే కొన్ని రోజులు, నెలల కోసం చెప్పినట్లే’ అంటూ సమాధానమిచ్చాడు. ఇక వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ తర్వాత అయితే అతడిని చూస్తే అసలు ధోనియేనా అనిపించింది.
ఆటతీరును విశ్లేషించమని అడిగిన పాపానికి మేం గెలవాలని మీకు లేనట్లుంది అంటూ ఎదురుదాడికి దిగాడు. వెస్టిండీస్‌తో ఓటమి తర్వాత రిటైర్మెంట్ గురించి అడిగిన ఆస్ట్రేలియా జర్నలిస్ట్‌కు క్లాస్ పీకడమే కాదు...ఇదే ప్రశ్న భారత విలేకరి అడిగితే సమాధానం భిన్నంగా ఉండేది అంటూ లేని అసహనం ప్రదర్శించాడు. దేనినైనా ‘లైట్’ తీసుకుంటూ కూల్‌గా కనిపించే కెప్టెన్ ఇలా గట్టు దాటడం కొత్తగా అనిపించింది.
అదే బాటలో తమ్ముళ్లు...: ధోనికి క్రికెట్‌లో రైనా, అశ్విన్ అత్యంత ఆత్మీయులు. తాజాగా వారి సమాధానాలు వింటే అసహనంతో, ఒకదానితో మరొకటి సంబంధం లేని సమాధానాలు చెప్పడాన్ని కూడా అతడిని చూసే నేర్చుకున్నారేమో అనిపిస్తుంది. వరల్డ్ కప్ సెమీస్‌లో భారత్ పరాజయం గురించి అడిగితే అశ్విన్ చెప్పిన సమాధానం వింతగా ఉంది. ‘నేను తర్వాతి రోజునుంచి పత్రికలు చదవలేదు. మా కుక్కకు బాగా జ్వరం వచ్చింది. దానికి స్ట్రోక్ తగిలింది. జీవితంలో ముఖ్యమైన విషయాలు ఉన్నాయని ఆ రోజు తెలుసుకున్నా’ అంటూ తలతిక్కగా మాట్లాడటమే కాదు, ఆ తర్వాత ప్రశ్న అడిగిన జర్నలిస్ట్‌తో వాదన కూడా పెట్టుకున్నాడు. రైనా అయితే పరిధి దాటి ‘భార్యతో సౌకర్యమా, ప్రియురాలితో సౌకర్యమా’ అంటూ కోచ్ గురించి తలాతోక లేకుండా మాట్లాడాడు. వీరు కనీసం తాము చేసిన వ్యాఖ్యలపై ఆ తర్వాత కూడా కనీస వివరణ ఇవ్వలేదు.
భజ్జీ రూటే వేరు: ఇక హర్భజన్ సింగ్ కూడా ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో వాదనకు దిగాడు. వరల్డ్ కప్‌లో మ్యాచ్ అవకాశం రావడం లేదంటూ వ్యాఖ్యానించిన ఒక వ్యక్తిని చెడామడా తిట్టేశాడు. తాజాగా ఒక పోలీసు అధికారి మహిళపై దాడి చేస్తున్న ఫోటోను ట్విట్టర్‌లో పెట్టి ప్రధానికి ట్యాగ్ చేశాడు. దాంతో రాజకీయాల్లోకి వస్తున్నారా అంటూ ఒక అభిమాని అడగడంతో భజ్జీ చెలరేగిపోయాడు. ‘నువ్వు పెద్ద వెధవవు. ప్రధాని కాబట్టి ట్యాగ్ చేశాను. కానీ ఒక పార్టీపై అభిమానంతో కాదు. మీకు ఎప్పుడు బుద్ధి వస్తుంది. నేనే గనక పోలీస్‌ను అయితే ముందు నిన్ను లోపలేసేవాడిని. నోర్మూసుకో’ అంటూ తన పంజాబీ ఆగ్రహాన్ని చూపించాడు.
సమాధానమివ్వలేరా...: మన క్రికెటర్లంతా ఇంతగా అసహనం, ఆగ్రహం ప్రదర్శించేందుకు అవన్నీ ఏమైనా వివాదాస్పద ప్రశ్నలా లేక సమాధానం సరిగ్గా ఇస్తే పరువు పోతుందా! అవును, కాదు అంటూ పొడిగా బదులిచ్చి దానికి అక్కడే ఫుల్‌స్టాప్ పెట్టవచ్చు. ధోనిలాంటి మాటకారి అయితే దీనిపై సమాధానం చెప్పలేను అంటూ సులువుగా తప్పించుకోవచ్చు. కానీ వీరెవరూ తమ ‘లోపలి మనిషి’ని దాచుకోవడం లేదు. మామూలు సమాధానంతో ముగించాలని కోరుకోవడం లేదు. లెక్కలేని తనం, స్టార్లం కాబట్టి ఏమైనా చెప్పవచ్చు అన్న ధోరణే ఇందులో కనిపిస్తోంది. ఒక రకమైన తప్పుడు సంప్రదాయానికి వీరు బీజం వేస్తున్నారు. ఇంతకంటే కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిన ఆటగాళ్లు చీటికిమాటికీ అసహనంతో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. మున్ముందు ఆటగాళ్లు తమ మాటల విషయంలో స్వీయ నియంత్రణ పాటించాలి. లేదంటే ఆటకంటే వివాదాల కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలిచే ప్రమాదం ఉంది.