న్యూఢిల్లీ: కొత్త కోచ్ హరేంద్ర సింగ్ ఆధ్వర్యంలో నెదర్లాండ్స్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిచిన భారత హాకీ జట్టుకు క్రీడా మంత్రిత్వ శాఖ ప్రత్యేక అలవెన్సులు ప్రకటించింది. మొత్తం హాకీ జట్టును టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లోకి చేర్చుతున్నట్లు మిషన్ ఒలింపిక్ సెల్ (ఎమ్‌ఓసీ) పేర్కొంది. ‘టాప్స్’ కింద జట్టులోని మొత్తం 18 మంది ప్లేయర్లు ఒక్కొక్కరికి నెలకు రూ. 50 వేలు చొప్పున అందివ్వనుంది. విభిన్న క్రీడాంశాల్లో ప్రతిభ చాటుతున్న ఆటగాళ్లను ‘టాప్స్’లో చేర్చినా ఒక జట్టు మొత్తాన్ని ఇందులో భాగం చేయడం ఇదే ప్రథమం. త్వరలో జరుగనున్న ప్రపంచ కప్, ఆసియా క్రీడల్లో ప్రదర్శన అనంతరం మహిళల హాకీ జట్టును కూడా ‘టాప్స్’లో చేర్చే అంశం గురించి పరిశీలించనున్నారు.
ఇటీవల అంతర్జాతీయ వేదికపై సత్తాచాటిన తెలుగు తేజం, జిమ్నాస్ట్ బుద్దా అరుణారెడ్డికి కూడా ప్రత్యేక అలవెన్సులు లభించనున్నాయి. ప్రస్తుతం బెల్జియంలో శిక్షణ తీసుకుంటున్న అరుణా రెడ్డి, ఆశిష్ కుమార్‌ల కోసం రూ. 14 లక్షలు కేటాయించారు. వీరితో పాటు ఉజ్బెకిస్తాన్‌లో శిక్షణ తీసుకుంటున్న ప్రణతీ నాయక్ కోసం రూ. 7.74 లక్షలు ప్రకటించారు. స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు జార్జియాలో ప్రత్యేక శిక్షణకు గాను రూ. 6.62 లక్షలు... ఇతర రెజ్లర్లు బజరంగ్ పూనియా, సుమిత్‌ల కోసం రూ. 3.22 లక్షలు మంజూరు చేశారు. డేవిస్ కప్ సభ్యుడు రామ్‌కుమార్ రామనాథన్‌కు ఆసియా క్రీడల ప్రత్యేక శిక్షణ నిమిత్తం రూ..12.57 లక్షలు కేటాయించారు. ఆర్చరీ సామాగ్రి కొనుగోలుకు రూ. 11.48 లక్షలు కేటాయించారు. దీంతో పాటు ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, త్రిష, రజత్ చౌహాన్‌ల ప్రత్యేక శిక్షణ కోసం ఇటాలియన్ కోచ్ సెర్గియో పగ్నికి రూ. 4.04 లక్షలు ప్రత్యేకంగా కేటాయించారు.
‘టాప్స్’లో భారత హాకీ ఆటగాళ్లు
Published Thu, Jul 12 2018 1:24 AM | Last Updated on Thu, Jul 12 2018 1:24 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment