వన్డేల్లోనూ పని పట్టాలి
రేపు కివీస్‌తో భారత్ తొలి మ్యాచ్
దూకుడు కొనసాగిస్తామన్న రహానే
ధర్మశాల: ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా చేతిలో 1-4తో చిత్తు... ఆ తర్వాత జింబాబ్వేపై 3-0తో ఘన విజయం... 2016లో భారత వన్డే జట్టు రికార్డు ఇది. ఈ సంవత్సరం మన జట్టు చెప్పుకోదగ్గ సంఖ్యలో వన్డేలు ఆడకపోగా, తొలిసారి సొంతగడ్డపై బరిలోకి దిగుతోంది. టెస్టుల్లో కివీస్‌ను చిత్తుగా ఓడించిన తర్వాత అలాంటి ప్రదర్శనను కొనసాగించాలని భారత్ పట్టుదలగా ఉంది. పైగా కోహ్లి నాయకత్వ పటిమతో ఇప్పుడు ధోనిపై కూడా అదే స్థారుులో అంచనాలు ఉండటంతో పాటు అతనిపై కూడా ఒత్తిడి ఉండటం ఖాయం. పూర్తిగా జూనియర్లతో జింబాబ్వేలో విజయవంతంగా జట్టును నడిపించినా... గత ఏడాది భారత్‌లోనే దక్షిణాఫ్రికా చేతిలో వన్డే సిరీస్‌లో ఎదురైన పరాభవాన్ని అతను మర్చిపోకపోవచ్చు. టెస్టు టీమ్‌తో పోలిస్తే సౌతీ, అండర్సన్‌లాంటి స్పెషలిస్ట్‌లు జట్టులోకి రావడం ఆ జట్టు బలాన్ని పెంచగా... మన జట్టు కీలక బౌలర్లు అశ్విన్, షమీలకు వన్డేలనుంచి విశ్రాంతినిచ్చింది. ఆఖరి సారిగా న్యూజిలాండ్ గడ్డపై ఇరు జట్ల మధ్య జరిగిన సిరీస్‌ను భారత్ 1-4తో కోల్పోరుుంది. ర్యాంకుల్లో కివీస్ జట్టు మనకంటే ఒక స్థానం ముందే ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సుదీర్ఘ సమయం పాటు భారత జట్టు ప్రాక్టీస్‌లో పాల్గొంది.
కెప్టెన్ ధోని, కోహ్లిలతో పాటు జట్టు సభ్యులంతా నెట్స్‌లో పాల్గొన్నారు. తొలి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్ ఎక్కువ సేపు బౌలింగ్ చేశాడు. అశ్విన్ గైర్హాజరులో అతను మ్యాచ్ బరిలోకి దిగవచ్చు. ‘టెస్టుల్లాగే వన్డేల్లోనూ దూకుడుగా ఆడతాం. మా బలమేంటో మాకు బాగా తెలుసు. తొలి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలని పట్టుదలగా ఉన్నాం. వన్డేలకు అనుగుణంగా ఆటను మార్చుకోవడం సమస్య కాదు. కొత్తగా జట్టుతో చేరిన కుర్రాళ్లు సత్తా చాటుతారని నమ్ముతున్నా’ అని మ్యాచ్ సందర్భంగా భారత బ్యాట్స్‌మన్ అజింక్య రహానే వ్యాఖ్యానించాడు.
భారత్‌లోనే ఇతర మైదానాలతో పోలిస్తే ధర్మశాల మరీ ఎక్కువగా బ్యాటింగ్‌కు అనుకూలం కాదు. పేసర్లకు ఈ పిచ్ చక్కగా అనుకూలిస్తుంది. సరిగ్గా చెప్పాలంటే కివీస్‌కు కూడా ఒక రకంగా అనుకూల మైదానం ఇది. ఈ స్టేడియంలో రెండు వన్డేలు ఆడిన భారత్ ఒకటి గెలిచి, మరొకటి ఓడింది. 2013లో ఇంగ్లండ్ చేతిలో ఏడు వికెట్లతో ఓడగా... 2014లో వెస్టిండీస్‌పై 59 పరుగులతో నెగ్గింది.