
ఎంతమంది బ్యాట్స్ మెన్ ఇలా చేస్తున్నారు!
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ ఇర‍్ఫాన్ పఠాన్ దక్షిణాఫ్రికా ఆటగాడు హషీం ఆమ్లా నిజాయితీని మెచ్చుకున్నాడు. ఈ కాలంలో కూడా అతనిలా ఎవరైనా నిజాయితీగా ఉంటూ, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించగలరా అని ప్రశ్నించాడు. అసలు విషయం ఇది.. నిన్న (శుక్రవారం) బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ ఓడిన పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. తొలి ఓవర్లోనే హషీం ఆమ్లా ఔటయ్యాడు. బెంగళూరు బౌలర్ వేసిన తొలి ఓవర్ ఐదో బంతిని ఆమ్లా ఆడగా ఎడ్జ్ తీసుకుంది. ఆ బంతి నేరుగా వెళ్లి కీపర్ కేదార్ జాదవ్ చేతుల్లో పడింది.
బెంగళూరు ఆటగాళ్లు అప్పీల్ చేసేలోగానే ఆమ్లా క్రీజు వదిలి వెళ్లిపోయాడు. వాస్తవానికి ఆ బంతి బ్యాట్ కు తాకిందా లేదా అన్నదానిపై కీపర్ జాదవ్, బౌలర్ చౌదరికి స్పష్టతలేకున్నా.. ఆమ్లా మాత్రం నిజాయితీగా ఔట్ ను ఒప్పుకున్నాడు. దీనిపై గుజరాత్ లయన్స్ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియాలో ప్రశంసించాడు. ‘ఎంత మంది బ్యాట్స్ మెన్.. బౌలర్లు అప్పీలు చేయకుండానే క్రీజు వదిలి వెళ్లిపోతున్నారు. ఆమ్లా నిజాయితీని చూసి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించండి’ అంటూ పఠాన్ ట్వీట్ చేశాడు. మరోవైపు ఈ మ్యాచ్ లో పట్టుదలతో ఆడిన పంజాబ్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
How many batsmen would walk without bowler appealing but that's how this guy plays his cricket @amlahash @IPL #honestman
— Irfan Pathan (@IrfanPathan) 5 May 2017