న్యూఢిల్లీ: చాలాకాలంగా టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నాల్గో స్థానం కోసమే అన్వేషణ సాగిందనేది కాదనలేని వాస్తవం. అయితే దీనికి శ్రేయస్ అయ్యర్ ద్వారా టీమిండియా మేనేజ్‌మెంట్‌కు దాదాపు సమాధానం దొరికినట్లే కనబడుతోంది. ఇటీవల కాలంలో భారత జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా చోటు సంపాదిస్తున్న అయ్యర్.. ఎక్కువగా నాల్గో స్థానంలోనే ఆడుతున్నాడు. అసలు నాల్గో స్థానం కోసమే అయ్యర్‌ను తుది జట్టులో కొనసాగిస్తురంటే బాగుంటుందేమో. కీలకమైన నాల్గో స్థానంలో ఎలా ఆడాలో అయ్యర్ బాగా వంట బట్టించుకున్నాడనే సెలక్టర్లు విశ్వసిస్తున్నారు.
ఇదే విషయాన్ని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కూడా తాజాగా తేల్చిచెప్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నాల్గో స్థానంలో అయ్యరే సరైన వాడని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడమే కాకుండా నాల్గో స్థానంలో భారత క్రికెట్ జట్టుకు భరోసా కల్పిస్తున్నాడని రోహిత్ తెలిపాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ జరగుతున్న తరుణంలో అయ్యర్‌పై విశ్వాసం వ్యక్తం చేశాడు రోహిత్. ఈ సిరీస్‌కు రోహిత్‌కు విశ్రాంతి కల్పించడంతో అతను కుటుంబంతో గడుపుతున్నాడు.దీనిలో భాగంగా మాట్లాడిన రోహిత్.. ‘ భారత క్రికెట్ జట్టులో యువ ఆటగాళ్లకు కొదవలేదు. రాబోవు సిరీస్‌ల్లో వారు తమ సత్తా చాటుకుని ప్రత్యేక ముద్ర వేయాలని ఆశిస్తున్నా. తదుపరి ఐసీసీ టైటిల్( టీ20 వరల్డ్‌కప్ నాటికి) టీమ్ అంతా సెట్ అవుతుందని ఆశిస్తున్నా.
ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నా. విషయం ఏమిటంటే.. ఇప్పటివరకూ కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శివం దూబేలు ఒక గ్రూప్‌గా ఆడిన మ్యాచ్‌లో చాలా తక్కువ. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. వీరంతా టీమ్‌గా ఆడుతున్న సమయంలో వారు మరింత ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకోవం ఖాయం. భారత క్రికెట్ జట్టులో పరిస్థితులు మారాయి. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ బాగా ఆడుతున్నాడు. ఆ స్థానంలో అయ్యర్ చాలాకాలం ఆడే అవకాశం ఉంది.
ఆ స్థానంలో అయ్యర్ అమితమైన ఆత్మవిశ్వాసంతో కన్పిస్తున్నాడు. పరిస్థితుల్ని బట్టి గేమ్‌ను అర్థం చేసుకుంటూ అతని ప్రణాళికల్ని కచ్చితంగా అమలు చేస్తున్నాడు. ఆ స్థానం ఇక అయ్యర్‌దే. పంత్ కూడా వెస్టిండీస్ సిరీస్‌లో బాగా ఆడాడు. దూబే అరంగేట్రం చేసి ఎంతోకాలం కాకపోయినా ఆకట్టుకుంటున్నాడు. అయినా ఇప్పుడు, రాబోయే సంవత్సరాల్లో కూడా నాల్గో స్థానంలో అయ్యరే వస్తాడు. దాంతో మిగతా వారు ఏయే స్థానాల్లో సెట్ అవుతారో ముందుగా వెతుక్కోవాల్సి ఉంటుంది. కేఎల్ రాహుల్ కూడా ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. దీన్ని ముందుకు తీసుకువెళతాడని ఆశిస్తున్నా. రెండు-మూడు మ్యాచ్‌ల్లో ఈ గ్రూప్‌పై అంచనాకు రాలేం. మరికొన్ని మ్యాచ్‌లు ఆడే వరకూ నిరీక్షించక తప్పదు. ’ అని రోహిత్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment