బ్రిడ్జిటౌన్: ముక్కోణపు సిరీస్లో భాగంగా దక్షిణాఫ్రికాతో శుక్రవారం జరుగనున్న కీలక మ్యాచ్కు వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో హోల్డర్ గాయపడటంతో తదుపరి మ్యాచ్లో పాల్గొనడం అనుమానంగా మారింది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో హోల్డన్ ఎడమ మోకాలికి గాయం అయ్యింది.
తన గాయంపై మాట్లాడిన హోల్డర్.. తదుపరి మ్యాచ్లో పాల్గొనడంపై అనుమానం వ్యక్తం చేశాడు. ఆ మ్యాచ్లో పాల్గొనాలని అనుకుంటున్నా, కచ్చితంగా చెప్పలేనని పేర్కొన్నాడు. ఆసీస్ తో మ్యాచ్లో బాగా ఆడినప్పటికీ, ఓడిపోవడం నిరాశపరిచిందన్నాడు. ముక్కోణపు సిరీస్లో ఇప్పటికే ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. దీంతో వెస్టిండీస్-దక్షిణాఫ్రికాల మధ్య రేపు జరిగే మ్యాచ్ కీలకం కానుంది.