ఒస్టాపెంకో సంచలనం
► మహిళల సింగిల్స్ ఫైనల్లోకి అన్‌సీడెడ్ క్రీడాకారిణి
► రేపు మూడో సీడ్ హలెప్‌తో టైటిల్ పోరు
పారిస్: కెరీర్‌లో ఏడు గ్రాండ్‌స్లామ్ టోర్నీ లు ఆడినా ఏనాడూ రెండో రౌండ్ దాటలేకపోయిన జెలెనా ఒస్టాపెంకో ఎనిమిదో ప్రయత్నంలో సంచలనమే సృష్టించింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో 20 ఏళ్ల ఈ లాత్వియా క్రీడాకారిణి మహిళల సింగిల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో 1983లో మిమా జౌసోవెచ్ (యుగోస్లావియా) తర్వాత ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరిన తొలి అన్‌సీడెడ్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.
గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఒస్టాపెంకో 7–6 (7/4), 3–6, 6–3తో 30వ సీడ్ బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్)పై గెలిచింది. గురువారమే తమ జన్మదినాన్ని నిర్వహించుకున్న ఒస్టాపెంకో, బాసిన్‌స్కీలు హోరాహోరీగా పోరాడినా తుదకు ఒస్టాపెంకోనే విజయం వరించింది. రెండో సెమీఫైనల్లో మూడో సీడ్ హలెప్ (రొమేనియా) 6–4, 3–6, 6–3తో రెండో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించింది.