
జులన్ గోస్వామి (ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ : మరో మూడు నెలల్లో ట్వంటీ20 ప్రపంచ కప్ ఉందనగా భారత స్టార్ క్రికెటర్, ఆల్ రౌండర్ జులన్ గోస్వామి ఈ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పారు. భారత తొలి టీ20 జట్టులో సభ్యురాలు జులన్ 12 ఏళ్ల కెరీర్ అనంతరం టీ20ల నుంచి వైదొలిగారు. ఆమె నిర్ణయాన్ని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. టీ20 జట్టులో తనకు చోటు ఇచ్చి, మద్దతు తెలిపిన అందరికీ జులన్ ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ప్రపంచ కప్‌లో భారత జట్టు మంచి ఫలితాలు రాబట్టాలని ఆమె ఆకాంక్షించారు.
డిఫెండింగ్ చాంపియన్ అయిన వెస్టిండీస్ సొంతగడ్డపై ఈ ఏడాది నవంబర్ 9 నుంచి 24 వరుకు మహిళల టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో జులన్ రిటైర్మెంట్ ప్రకటించడం టీమిండియాకు ప్రతికూలాంశమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, వన్డే క్రికెట్‌లో 200 వికెట్లు పడగొట్టిన తొలి మహిళా బౌలర్‌గా అరుదైన ఘనతను గోస్వామి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గత నాలుగేళ్లుగా టెస్టులు ఆడని జులన్.. పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలకండతో కేవలం వన్డేలకే పరిమితం కానున్నారు.
కెరీర్‌లో 68 టీ20 మ్యాచ్‌లాడిన జులన్ 56 వికెట్లు తీశారు. ఆస్ట్రేలియాపై 2012లో తీసిన 5/11 ఆమె టీ20 బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన. బ్యాటింగ్‌లో 46 ఇన్నింగ్స్‌లాడి 405 పరుగులు చేశారు. అత్యధిక స్కోరు 37 నాటౌట్. టీ20ల్లో భారత్ నుంచి అత్యధిక వికెట్లు తీసిన మహిళా బౌలర్ సైతం జులనే కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment