స్పాన్సర్ కోసం ఖడే ఎదురుచూపులు
ముంబై : వీర్‌ధావల్ ఖడే... భారత్‌లో ఫాస్టెస్ట్ స్విమ్మరే కాకుండా జాతీయ రికార్డులతో పాటు 2008 ఒలింపిక్స్‌లో దేశం తరఫున అత్యంత పిన్న వయస్సు (17)లో ప్రాతినిధ్యం వహించిన ఈతగాడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే 24 ఏళ్ల అనంతరం ఆసియా గేమ్స్ 50మీ. బటర్‌ఫ్లయ్ విభాగంలో దేశానికి ఓ పతకం (కాంస్యం) అందించగలిగాడు. ఇంత సాధించినా... రష్యాలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు వెళ్లేందుకు స్పాన్సర్ లేక ఇబ్బందిపడుతున్నాడు. ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇది ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్ కావడంతో 24 ఏళ్ల ఖడేకు ఇందులో పాల్గొనడం అత్యంత ముఖ్యం.
‘స్పాన్సర్‌ను వెతుక్కోవడం చాలా కష్టం. దీంతో వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనేందుకు నా సొంత డబ్బులు రూ.2 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం నేను తహశీల్దార్‌గా కూడా పనిచేస్తున్నాను కాబట్టి పూర్తిగా స్విమ్మింగ్‌కు సమయం కేటాయించలేకపోతున్నాను. రెండింటినీ సమన్వయం చేయడం చాలా కష్టం’ అని ఖడే అన్నాడు. మరోవైపు ఖడే సమస్యను క్రీడా శాఖతో ఈనెల 8న చర్చిస్తామని భారత స్విమ్మింగ్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి కమలేష్ నానావతి చెప్పారు.