110 పరుగులకే కుప్పకూలిన లంక
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా బౌలర్లు ఫిలాండర్ (4/27), రబడ (4/37) చెలరేగడంతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 110 పరుగులకే ఆలౌటైంది. తరంగ (26)దే అత్యధిక స్కోరు. ఫలితంగా దక్షిణాఫ్రికాకు మొదటి ఇన్నింగ్స్‌లో 282 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అయితే లంకకు ఫాలోఆన్ ఇవ్వని సఫారీలు రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేసి తమ ఓవరాల్ ఆధిక్యాన్ని 317 పరుగులకు పెంచుకున్నారు.
అంతకుముందు 297/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 392 పరుగులకు ఆలౌటైంది. డి కాక్ (124 బంతుల్లో 101; 11 ఫోర్లు) సెంచరీ పూర్తి చేసుకోగా, లహిరు కుమారకు 6 వికెట్లు దక్కాయి. ఈ ఇన్నింగ్స్‌లో కైల్ అబాట్ వికెట్‌తో శ్రీలంక స్పిన్నర్ రంగన హెరాత్, చమిందా వాస్ (355)ను అధిగమించి ఆ దేశం తరఫున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మురళీధరన్ (795) తర్వాత రెండో స్థానానికి (356) చేరుకున్నాడు.