టాంపరింగ్ కు పాల్పడ్డ క్రికెటర్ కు జరిమానా
దుబాయ్: శ్రీలంకతో జరుగుతున్నతొలి టెస్టు మ్యాచ్ లో బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డ దక్షిణాఫ్రికా బౌలర్ వెర్నాన్ ఫిలిందర్ కు మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత పడింది. తొలి టెస్టు మ్యాచ్ లో భాగంగా మూడో రోజు ఆటలో ఫిలిందర్ బాల్ టాంపరింగ్ కు పాల్పడినట్లు రుజువు కావడంతో అతనికి జరిమానా విధించారు. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం టెస్ట్ మ్యాచ్ ల్లో టాంపరింగ్ కు పాల్పడితే 42.3 సెక్షన్ ను వర్తింపచేస్తారు. సాధారణంగా టాంపరింగ్ పాల్పడిన క్రికెటర్లకు పాయింట్ల ఆధారంగా మ్యాచ్ ఫీజులో 50 నుంచి 100 శాతం వరకూ కోత విధించడంతో పాటు ఒక టెస్టు మ్యాచ్, రెండు వన్డే మ్యాచ్ లు నిషేధం ఎదుర్కొనే అవకాశం ఉంది.
శుక్రవారం జరిగిన మూడో రోజు ఆటలో బంతిని ఫిలిందర్ చేతి వేళ్లతో గోకుతూ నిబంధనలు ఉల్లంఘించాడు. దీనిని ఫీల్డ్ అంపైర్లు బిల్లీ బౌడన్, రిచర్డ్ కెట్లిబారగ్ తో సహా మూడో, నాల్గో అంపైర్లు టీవీ పుటేజీలో పరీక్షించారు. కాకపోతే ఎటువంటి విచారణ లేకుండానే ఫిలిందర్ టాంపరింగ్ కు పాల్పడినట్లు అంగీకరించాడు.