లూయిస్ హమిల్టన్(ఫైల్ ఫోటో)
లండన్: ఫార్ములావన్లో రాబోయే పది సంవత్సరాలు కూడా తన కుమారుడు లూయిస్ హమిల్టన్ హవానే కొనసాగుతుందని తండ్రి ఆంథోని జోస్యం చెప్పాడు. ప్రపంచ ఫార్ములావన్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హమిల్టన్ మరొక దశాబ్దం పాటు రాజ్యమేలడం ఖాయమన్నాడు. హమిల్టన్ రోజు రోజుకీ మెరుగుపడటమే కాదు, మానసికంగా ఎంతో దృఢంగా తయారవుతున్నాడని కుమారునిపై విశ్వాసం వ్యక్తం చేశాడు. తన కుమారునికి మోటార్ రేస్పై ఉన్న మక్కువే అతన్ని మూడు సార్లు ప్రపంచ చాంపియన్ గా నిలపిందన్నాడు. హమిల్టన్ కు గెలవాలన్న తపన చాలా ఎక్కువని, అందుకోసం తీవ్రంగా శ్రమిస్తూ తన అనుకున్న లక్ష్యాలను సాధిస్తూ ఉంటాడని ఆంథోని తెలిపాడు. కనీసం మరో ఏడు సంవత్సరాలైనా తన కుమారుని జైత్రయాత్ర కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశాడు.
గతేడాది హమిల్టన్ మూడోసారి ప్రపంచ చాంపియన్ గా అవతరించిన సంగతి తెలిసిందే. దీంతో తొమ్మిదేళ్ల వ్యవధిలో హామిల్టన్ మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచి ఫార్ములావన్ లో తనదైన ముద్రను వేశాడు. దీంతో పాటు 43 గ్రాండ్‌ప్రి టైటిల్స్ గెలిచి ఫార్ములావన్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ నెగ్గిన మూడో డ్రైవర్ గా హమిల్టన్ గుర్తింపు సాధించాడు.