నాథన్ లియాన్ రికార్డుల మోత..
బెంగళూరు: భారత్ తో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో్ చెలరేగిపోయిన ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ రికార్డుల మోత మోగించాడు. భారత్ ను మొదటి ఇన్నింగ్స్ లో 189 పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించిన లియాన్.. భారత్ లో అద్భుతమైన గణాంకాలను కూడా నమోదు చేశాడు. తొలుత భారత్ లో అత్యధిక వికెట్లు సాధించిన ఆసీస్ బౌలర్ గా సరికొత్త రికార్డును లియాన్ లిఖించాడు. ఈ మ్యాచ్ కు ముందు ఓవరాల్ గా భారత్ పై అత్యధిక వికెట్లను సాధించిన ఆసీస్ బౌలర్ బ్రెట్ లీ(53). తాజాగా ఆ రికార్డును లియాన్ బద్ధలు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ వికెట్ ను తీసిన తరువాత బ్రెట్ లీ రికార్డును లియాన్ సవరించాడు.
మరొకవైపు భారత్ లోఅత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన విదేశీ బౌలర్ గా లియాన్ గుర్తింపు సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 50 పరుగులిచ్చిన లియాన్ ఎనిమిది వికెట్లు సాధించాడు. దాంతో భారత్ లో బెస్ట్ ఫిగర్స్ ను నమోదు చేసిన ఆతిథ్య బౌలర్ గా లియాన్ చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉంచితే టెస్టుల్లో విరాట్ కోహ్లి, చటేశ్వర పూజారాలను లియాన్ ఐదుసార్లు అవుట్ చేశాడు. తద్వారా వీరిద్దర్నీ అత్యధిక సార్లు అవుట్ చేసిన ఘనతను సైతం లియాన్ సాధించాడు. దాంతో పాటు చిన్నస్వామి స్టేడియంలో అత్యధిక వికెట్లు సాధించిన విదేశీ బౌలర్ గా లియాన్ నిలిచాడు.