పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 1996లో అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ ఫిక‍్సింగ్ తారస్థాయికి చేరుకుందని వెల్లడించాడు. పాకిస్థాన్ క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ అపరిచితులతో నిండిఉండేదని, అత్యంత చెత్తగా ఉండేదని అక్తర్ బాంబు పేల్చాడు. కాగా ఫిక్సింగ్ ముఠాకు తానెప్పుడూ దూరంగా ఉండేవాడినని చెప్పాడు. ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలని, నిబద్ధతతో క్రికెట్ ఆడాలని ఇతర క్రికెటర్లకు సలహా ఇచ్చేవాడినని అక్తర్ వెల్లడించాడు. పాకిస్థాన్కు చెందిన ఓ టీవీ ఛానెల్ ఈ విషయాలను ప్రసారం చేసింది.
2010లో ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ ఆమిర్ను కూడా అప్పట్లో హెచ్చరించినట్టు అక్తర్ తెలిపాడు. ఫిక్సింగ్ వ్యవహారాలతో సంబంధమున్న ఆటగాళ్లకు దూరంగా ఉండాల్సిందిగా ఆమిర్కు చెప్పినట్టు వెల్లడించాడు. కాగా ఐదేళ్లు నిషేధానికి గురైన ఆమిర్ గతేడాది మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఇటీవల బహిరంగంగా తీవ్ర స్థాయిలో విమర్శించుకున్న పాకిస్థాన్ మాజీ కెప్టెన్లు జావేద్ మియాందాద్, షాహిద్ అఫ్రిదీ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని అక్తర్ సూచించాడు. అఫ్రిదీ డబ్బుల కోసం మ్యాచ్లను ఫిక్సింగ్ చేసేవాడని మియాందాద్ ఆరోపించిన సంగతి తెలిసిందే.