ఇక ఆ లక్ష్యంతోనే సాగుతా:పూజారా
చెన్నై:గడిచిన ఏడాది భారత టెస్టు క్రికెట్లో అత్యంత నిలకడైన ఆటను ప్రదర్శించిన ఆటగాళ్లలో చటేశ్వర పూజారా ఒకడు. 2016లో బ్యాటింగ్ పరంగా చూస్తే టీమిండియా సాధించిన విజయాల్లో విరాట్ కోహ్లి, పూజారాలు కీలక పాత్ర పోషించారు. 11 టెస్టుల్లో 836 పరుగులు చేసిన పూజారా గత ఏడాదిని ఘనంగానే ముగించాడు. అయితే టెస్టు ఆటగాడిగా మాత్రమే ముద్రపడిన పూజారా.. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్ లో కూడా సత్తా చాటాలని భావిస్తున్నాడు. వన్డే, ట్వంటీ 20 ఫార్మాట్లలో రాణించడం కోసం పూర్తిస్థాయి దృష్టి సారించనున్నట్లు పూజారా పేర్కొన్నాడు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజారా పలు విషయాల్ని వెల్లడించాడు.
' నేను కచ్చితంగా అన్ని ఫార్మాట్లకు సెట్ అవుతానని అనుకుంటూ ఉంటా. నాపై నాకు నమ్మకం ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో కూడా అవకాశాలు ఎక్కువగానే వస్తాయని ఆశిస్తున్నా. అన్ని ఫార్మాట్ల క్రికెటర్ గా గుర్తింపు సాధించాలనేది నా లక్ష్యం. అదే లక్ష్యంతో ముందుకు సాగుతా. 2016వ సంవత్సరం నా నమ్మకాన్ని మరింత పెంచింది. రాబోవు సంవత్సరాల్లో కూడా అదే నమ్మకంతో ఆడతా. నేను సాధ్యమైనంతవరకూ నిలకడగా ఆడి పరుగులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటా'అని పూజారా పేర్కొన్నాడు.
ఇదిలా ఉంచితే, న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్లో కోచ్ అనిల్ కుంబ్లే తన బ్యాటింగ్ ను తప్పుపట్టలేదనే విషయాన్ని పూజారా మరోసారి పేర్కొన్నాడు. కేవలం తన యావరేజ్ను పెంచుకోమని మాత్రమే చెప్పాడని తెలిపాడు. తన బ్యాటింగ్ పై కుంబ్లేకు అపారమైన నమ్మకం ఉందని, అదే క్రమంలో ఎటువంటి ఆందోళన చెందకుండా సహజసిద్ధమైన గేమ్ను ఆడమన్నట్లు పూజారా స్పష్టం చేశాడు.