సచిన్, ద్రవిడ్ల సరసన పూజారా
విశాఖపట్టణం:టీమిండియా ఆటగాడు చటేశ్వర పూజారా అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. తాజాగా విశాఖలో ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టులో మూడు వేల పరుగుల మార్కును చేరిన పూజారా.. అత్యంత వేగంగా ఈ ఘనతను సాధించిన ఐదో భారత క్రికెటర్ గా నిలిచాడు. ఈ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ ద్వారా 67వ ఇన్నింగ్స్ ఆడుతున్న పూజారా మూడు వేల పరుగుల క్లబ్ లో చేరాడు. ఇది పూజారా కెరీర్ లో 40 వ టెస్టు మ్యాచ్. ఈ క్రమంలోనే పూజారా టెస్టుల్లో 9 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
అంతకుముందు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ద వాల్ రాహుల్ ద్రవిడ్లు కూడా 67 ఇన్నింగ్స్ ల్లోనే మూడు వేల పరుగులను పూర్తిచేసుకున్నారు. తద్వారా ఆ ఇద్దరి దిగ్గజ ఆటగాళ్ల సరసన పూజారా నిలిచాడు. అయితే భారత తరుపున టెస్టుల్లో ఈ మార్కును అత్యంత వేగంగా సాధించిన ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్. సెహ్వాగ్ 55 ఇన్నింగ్స్ ల్లో మూడు వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసుకుని ఈ ఘనతను వేగంగా సాధించిన భారత ఆటగాళ్లలో తొలి స్థానంలో నిలిచాడు.
ఆ తరువాత స్థానాల్లో భారత మాజీ కెప్టెన్ మొహ్మద్ అజహరుద్దీన్(64ఇన్నింగ్స్లు), సునీల్ గవాస్కర్(66 ఇన్నింగ్స్లు)లు ఉన్నారు. అయితే ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకుని సచిన్ వారుసుడిగా మన్ననలు అందుకుంటున్న టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి.. మూడు వేల మార్కును చేరడానికి 73 ఇన్నింగ్స్ లు పట్టాయి.