క్లార్క్, హాడిన్ సెంచరీలు | Michael Clarke and Haddin tons leave England reeling | Sakshi
Sakshi News home page

క్లార్క్, హాడిన్ సెంచరీలు

Published Sat, Dec 7 2013 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM

క్లార్క్, హాడిన్ సెంచరీలు

క్లార్క్, హాడిన్ సెంచరీలు

అడిలైడ్:  ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. కెప్టెన్ క్లార్క్ (245 బంతుల్లో 148; 17 ఫోర్లు), హాడిన్ (177 బంతుల్లో 118; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగడంతో శుక్రవారం రెండో రోజు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ను 158 ఓవర్లలో 9 వికెట్లకు 570 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. హారిస్ (55 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 21 ఓవర్లలో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. కార్‌బెరీ (20 బ్యాటింగ్), రూట్ (9) క్రీజులో ఉన్నారు. కుక్ (3)ను జాన్సన్ దెబ్బతీశాడు. అంతకుముందు 273/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన క్లార్క్, హాడిన్‌లు నిలకడగా ఆడారు.

ఇంగ్లండ్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారించారు. క్లార్క్ భారీ షాట్లు ఆడకపోయినా.. హాడిన్ మాత్రం స్పిన్నర్ల బౌలింగ్‌లో సిక్సర్ల మోత మోగించాడు. 91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షార్ట్ లెగ్‌లో బెల్ క్యాచ్ మిస్ చేయడంతో ఊపిరి పీల్చుకున్న క్లార్క్... క్రమంగా కెరీర్‌లో 26వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు స్టోక్ బౌలింగ్‌లో అండర్సన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య ఆరో వికెట్‌కు నెలకొన్న 200 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత జాన్సన్ (5), సిడిల్ (2) వెంటవెంటనే అవుటైనా... హారిస్ సమయోచితంగా ఆడాడు.

హాడిన్‌తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 46 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో హాడిన్ 4వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత వచ్చిన లియోన్ (17 నాటౌట్) నెమ్మదిగా ఆడుతూ పదో వికెట్‌కు హారిస్‌తో కలిసి అజేయంగా 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. బ్రాడ్ 3, స్వాన్, స్టోక్స్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ ఇన్నింగ్స్‌లో కొట్టిన 12 సిక్సర్లు యాషెస్‌లో ఆసీస్ తరఫున రికార్డు.  2005 ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌పై 10 సిక్సర్లు కొట్టారు.
 మండేలాకు నివాళి: శుక్రవారం తెల్లవారుజామున మరణించిన దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు ఇరుజట్లు నివాళులు అర్పించాయి. మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు నిమిషం పాటు మౌనం పాటించి నల్ల బ్యాండ్లను ధరించి బరిలోకి దిగారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement