మిచెల్ స్టార్క్ అరుదైన ఘనత
గాలే: ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో వంద వికెట్లను సాధించిన ఐదో లెఫ్మార్మ్ పేసర్గా గుర్తింపు సాధించాడు. శ్రీలంకతో ఇక్కడ ఆరంభమైన రెండో టెస్టులో స్టార్క్ ఈ అరుదైన ఫీట్ను నమోదు చేశాడు. అంతకుముందు ఈ ఘనతను అందుకున్న ఆస్ట్రేలియా లెఫ్మార్మ్ పేసర్లలో మిచెల్ జాన్సన్(113),అలెన్ డేవిడ్సన్(186), బిల్ జాన్స్టన్(160), బ్రూస్ రీడ్(113)లు మాత్రమే ఉన్నారు. గురువారం తొలి రోజు ఆటలో భాగంగా శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండిస్ వికెట్ను తీయడం ద్వారా స్టార్క్ వంద వికెట్ల క్లబ్లో చేరాడు.
ఈ మ్యాచ్లో లంకేయులు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. తొలి టెస్టు గెలిచి మంచి ఊపుమీద ఉన్న మాథ్యూస్ సేనకు రెండో టెస్టు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు కరుణరత్నే(0) , కౌశల్ సిల్వా(5)లు తీవ్రంగా నిరాశపరిచారు. అనంతరం కౌశాల్ పెరీరా(49), కుశాల్ మెండిస్(86)లు రాణించడంతో లంకేయులు తేరుకున్నారు. ఈ జోడీ మూడో వికెట్ కు 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి శ్రీలంక పరిస్థితిని చక్కదిద్దింది.