
కరాచీ: పాకిస్తాన్ లెఫ్టార్మ్ పేసర్ మహ్మద్ ఆమిర్ వన్డే వరల్డ్‌కప్‌కు వెళ్లే జట్టులో అనూహ్యంగా చోటు దక్కించుకున్నాడు. ముందుగా ప్రకటించిన జాబితాలో చోటు దక్కించుకోని ఆమిర్.. వరల్డ్‌కప్ కొద్ది రోజుల్లో ఆరంభం కానున్న తరుణంలో జట్టులోకి వచ్చాడు. గురువారం పీసీబీ సెలక్టర్లు ఆమిర్‌ను పాక్ క్రికెట్ జట్టులో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా ఆమిర్ ఫామ్‌లో లేకపోవడంతో తొలుత ప్రకటించిన జాబితాలో అతనిపై పీసీబీ సెలక్టర్లు నమ్మకం ఉంచలేదు.
అయితే ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న పాక్ జట్టు అక్కడి పిచ్‌లపై అంతగా ఆకట్టుకోవడం లేదు. పాక్ బౌలర్లను ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ చీల్చి చెండాడటంతో ఆ జట్టు పేస్ బౌలింగ్ విభాగం ఆందోళనకరంగా మారింది. దాంతో చీఫ్ సెలెక్టర్ ఇంజమాముల్ హక్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ తమ తప్పును దిద్దుకునే పనిలో పడింది. ముఖ్యంగా పేస్ బౌలర్లు తేలిపోతుండటంతో పునరాలోచనలో పడ్డ సెలెక్షన్ కమిటీ సీనియర్ పేసర్ ఆమిర్‌కు జట్టులో చోటు కల్పించింది. ఇక వేరే ప్రత్యామ్నయ మార్గం లేకపోవడంతో ఆమిర్‌ను ఉన్నపళంగా వరల్డ్‌కప్ జట్టులో చేర్చింది. అయితే. ప్రస్తుతం చికెన్‌పాక్స్‌తో బాధపడుతున్న ఆమిర్ ఈ నెల 30 వరకు కోలుకుంటాడా లేదా అన్నది సందేహంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment