
'ధోని సత్తా ఏమిటో మరోసారి చూశాం'
కోల్‌కతా: విజయ్ హజారే వన్డే ట్రోఫీలో భాగంగా ఛత్తీస్‌గఢ్ తో జరిగిన మ్యాచ్ లో పది ఫోర్లు, ఆరు సిక్సర్లతో శతకం సాధించి జార్ఖండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన మహేంద్ర సింగ్ ధోనిపై ప్రత్యర్థి కెప్టెన్ మొహ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు. ధోనిలో ఇంకా సత్తా తగ్గలేదనడానికి ఈ తాజా ఇన్నింగ్స్ ఒక నిదర్శమని కొనియాడాడు.
'ధోని సహజసిద్ధమైన పవర్ ఏమిటో మరొకసారి చూశాం. అతను ఇంకా అన్ని ఫార్మాట్లలో ప్రమాదకర ఆటగాడని నేను బలంగా నమ్ముతున్నా. బంతిని ధోని హిట్ చేసే విధానాన్ని బట్టి చూస్తే తన పవర్ ఇంకా అలాగే ఉంది. ధోని అరంగేట్రం మ్యాచ్ నుంచి అతన్ని నేను చూస్తునే ఉన్నా. అప్పటికీ, ఇప్పటికీ అతని ఆట తీరులో ఎటువంటి మార్పు లేదు. ధోని ఏదో ప్రాక్టీస్ కోసమే ఈ టోర్నీలు ఆడుతున్నాడని మనం అనుకుంటే పొరపాటే. అతను ప్రతీ గేమ్ను చాలా సీరియస్ గా తీసుకుంటాడు' అని కైఫ్ పేర్కొన్నాడు. ఆదివారం చత్తీస్ గఢ్ తో జరిగిన మ్యాచ్ లో ధోని 107 బంతుల్లో 129 పరుగులు చేశాడు. దాంతో జార్ఖండ్ 78 పరుగుల తేడాతో గెలుపొందింది.