
ఆఖర్లో అద్భుతం
మ్యాచ్ ఆరంభంలో అంతగా ఆకట్టుకోలేకపోయిన 2010 రన్నరప్ నెదర్లాండ్స్ జట్టు ఆఖర్లో మాత్రం అద్భుతం చేసింది. అప్పటి వరకు ఆధిక్యంలో ఉన్న మెక్సికోకు అడ్డుకట్ట వేస్తూ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది.
ఓటమి అంచుల్లో నుంచి విజయతీరాలకు నెదర్లాండ్స్
2-1తో మెక్సికోపై విజయం
ఆరు నిమిషాల తేడాలో రెండు గోల్స్
క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశం
మెక్సికోకు మరోసారి నిరాశ
ఫోర్టలెజా: మ్యాచ్ ఆరంభంలో అంతగా ఆకట్టుకోలేకపోయిన 2010 రన్నరప్ నెదర్లాండ్స్ జట్టు ఆఖర్లో మాత్రం అద్భుతం చేసింది. అప్పటి వరకు ఆధిక్యంలో ఉన్న మెక్సికోకు అడ్డుకట్ట వేస్తూ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఫలితంగా ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో నెదర్లాండ్స్ 2-1తో మెక్సికోపై గెలిచి క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. స్నిడెర్ (88వ ని.), హంటెల్లార్ (90+4వ ని.) డచ్ జట్టుకు గోల్స్ అందించగా, మెక్సికో తరఫున డాస్ సాంటోస్ (48వ ని.) గోల్ చేశాడు.
తొలి అర్ధభాగం వరకు పక్కా ప్రణాళికతో ఆడిన మెక్సికో జట్టు డచ్ అటాకింగ్‌ను సమర్థంగా నిలువరించినా... రెండో అర్ధభాగంలో మాత్రం నిరాశపర్చింది. మెక్సికన్ గోల్ కీపర్ ఓకో మరోసారి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. ఈ ఓటమితో మెక్సికో వరుసగా ఆరో ప్రపంచకప్‌లోనూ ప్రిక్వార్టర్ ఫైనల్ దశలోనే ఇంటిదారి పట్టింది.
మ్యాచ్ ఆరంభం నుంచే మెక్సికో బంతిపై పట్టు కోసం బాగా పోరాడింది. అయితే డచ్ ఆటగాళ్లు వ్యూహత్మకంగా కదులుతూ ప్రత్యర్థి అటాకింగ్‌ను సమర్థంగా నిలువరించారు. 7వ నిమిషంలో అగులార్ (మెక్సికో) కొట్టిన ఫ్రీ కిక్ గోల్ పోస్ట్‌కు దూరంగా వెళ్లింది.
ప్రత్యర్థి అటాకింగ్‌ను అడ్డుకునేందుకు నెదర్లాండ్స్ 9వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్ నీజెల్ డీ జోంగ్ స్థానంలో డిఫెండర్ మార్టిన్ ఇండిని బరిలోకి దించి జట్టును సమతుల్యం చేసింది.
17, 20వ నిమిషాల్లో హెరీరా (మెక్సికో) కొట్టిన రెండు కిక్‌లకు డివ్రిజ్ (డచ్) సమర్థంగా అడ్డుకట్ట వేశాడు. ఈ దశలో సాంటోస్ (మెక్సికో) కొట్టిన కార్నర్ కిక్ కూడా వృథా అయ్యింది.
24వ నిమిషంలో చాలా దూరం నుంచి సాల్సిడో (మెక్సికో) కొట్టిన బంతిని డచ్ గోల్ కీపర్ సిలిసెన్ పైకి ఎగురుతూ రెండు చేతులతో పక్కకు నెట్టేశాడు.
బంతిని ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఇరుజట్లు హోరాహోరీగా తలపడినా గోల్ ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. మెక్సికో డిఫెండర్లను తప్పిస్తూ గోల్ పోస్ట్ వైపు వేగంగా దూసుకొచ్చిన వాన్ పెర్సీ (డచ్) 27వ నిమిషంలో ఎడమ కాలితో కొట్టిన బంతి తృటిలో బయటకు వెళ్లింది.
ఫోర్టలెజాలో వేడి, ఉక్కపోత అధికంగా ఉండటంతో రెండు కూలింగ్ బ్రేక్‌లను అమలు చేశారు. 30వ నిమిషం తర్వాత మూడు నిమిషాల పాటు ఈ విరామం ఇచ్చారు.
37వ నిమిషంలో స్నిజ్డెర్ కొట్టిన కిక్ రోడ్రిగ్వెజ్ (మెక్సికో) అడ్డుకున్నాడు. ఆ తర్వాతి నిమిషంలోనే మెక్సికో వలయంలోకి దూసుకుపోయిన డిర్క్.... గోల్ పోస్ట్ ముందర బంతిని కొట్టడంతో కాస్త తడబడ్డాడు. తర్వాత గుర్డాడో, సాంటోస్, పెరాల్టా (మెక్సికో), రాబెన్, మార్టిన్ (డచ్) ఎదురుదాడులు చేసినా ప్రయోజనం లేకపోయింది. తొలి అర్ధభాగం వరకు బంతి ఎక్కువగా డచ్ ఆధీనంలో ఉన్నా... గోల్ కోసం చేసిన రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి.
మరోవైపు బంతిని ఆధీనంలోకి తీసుకునేందుకు తీవ్రంగా శ్రమించిన మెక్సికో గోల్స్ కోసం చేసిన ఏడు ప్రయత్నాలు వృథా అయ్యాయి.
రెండో అర్ధభాగం మొదలైన మూడో నిమిషంలో (48వ) ఫార్వర్డ్ డాస్ సాంటోస్ గోల్ కొట్టి మెక్సికోకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. టాప్ ఏరియా నుంచి డెయిలీ బ్లైండ్ ఇచ్చిన ఆఫ్ వ్యాలీని కచ్చితమైన షాట్‌తో గోల్ కీపర్ సిలిసెన్‌ను తప్పిస్తూ నేర్పుగా గోల్‌పోస్ట్‌లోకి పంపాడు.
తర్వాత నెదర్లాండ్స్ వరుసగా దాడులు చేస్తూ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినా... మెక్సికో రక్షణ శ్రేణి సమర్థంగా అడ్డుకుంది.
57వ నిమిషంలో రాబెన్ కొట్టిన కార్నర్ కిక్‌ను డివ్రిజ్ హెడర్‌గా మల్చే ప్రయత్నం చేసినా మెక్సికో గోల్ కీపర్ ఓకో నిలువరించాడు.
74వ నిమిషంలో మర్క్విజ్ ఇచ్చిన పాస్‌ను రాబెన్ పవర్‌ఫుల్ షాట్‌గా మల్చిన గోల్ కీపర్ ఓకో మరోసారి అడ్డుకున్నాడు. 76వ నిమిషంలో రెండోసారి కూలింగ్ బ్రేక్ ఇచ్చారు.
88వ నిమిషంలో రాబెన్ ఇచ్చిన కార్నర్ కిక్‌ను మెంఫిస్ హెడర్‌తో వెనకవైపు పంపాడు. అక్కడే కాచుకుని ఉన్న స్నిడెర్ కొద్ది దూరం నుంచి బలమైన షాట్‌తో నేరుగా గోల్ పోస్ట్‌లోకి పంపి స్కోరును సమం చేశాడు.
90+4లో లభించిన పెనాల్టీని హంటెల్లార్ అద్భుత రీతిలో గోల్‌గా మలిచాడు. దీంతో డచ్ 2-1తో విజయం సాధించింది.
ప్రపంచకప్‌లో నేడు (ప్రి క్వార్టర్స్)
ఫ్రాన్స్ xనైజీరియా; రాత్రి గం. 9.30
జర్మనీ xఅల్జీరియా; అర్ధరాత్రి గం. 1.30
సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం