ప్రవీణ్ కుమార్(ఫైల్‌ఫొటో)
మీరట్: తాను తప్పతాగి పక్కంటి వారిపై దాడి చేసినట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశాడు. తాను ఎప్పుడూ చీమకు కూడా హాని కల్గించనని, మరి అటువంటిది తాగి ఒక అబ్బాయిపై, అతని తండ్రిపై దాడి చేశానంటూ ఫిర్యాదు చేయడం బాధించిందన్నాడు. కాగా, ఆ అబ్బాయి తండ్రి దీపక్ శర్మనే తనపై చేయి చేసుకున్నాడని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నాడు. ‘ నేను అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడా. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను ఎప్పుడూ కనీసం చీమను కూడా చంపలేదు. అటువంటప్పుడు ఒక అబ్బాయిపై దాడి ఎందుకు చేస్తాను.
మా ఇంటికి సమీపంలో ఆ అబ్బాయి, అతని తండ్రి కలిసి నాతో గొడవ పడ్డారు. నేను కారులో ఉన్న సమయంలో వారిద్దరూ నన్ను బయటలాగి మరీ దాడి చేశారు. ఇలా నేను తాగి వారిని కొట్టాననడం అంతా అబద్ధం. నా గొలుసును లాక్కోవడానికి వారు ప్రయత్నించారు. ఇక్కడ స్థానిక రాజకీయాలతో నాపై ఇలా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎప్పుడూ ఇక్కడ పెద్దగా ఉండను. నాకు రెండు-మూడు ఇళ్లులు న్నాయి. నేను కేవలం ఇక్కడ పెయింట్ వర్క్ ఎలా జరుగుతుందనే చూద్దామనే వచ్చా. చాలామంది ఇతరుల సక్సెస్ చూసి ఓర్వలేరు. నా ఇమేజ్‌ను డామేజ్ చేయాలని చూశారు’ అంటూ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నాడు.
టీమిండియా తరఫున మ్యాచ్‌లు ఆడిన ప్రవీణ్ కుమార్ కాస్త దుందుడుగు స్వభావం కలిగిన వాడు. గతంలో కూడా అతడు తప్ప తాగి గొడవ పడిన సంఘటనలు ఉన్నాయి. అతడి క్రికెట్ కెరీర్ మొదట్లో సాఫీగా సాగినా ఫామ్ ను కోల్పోయి టీమిండియాలో స్థానం కోల్పోయాడు. అయితే ప్రవీణ్ కుమార్ ఫుల్లుగా తాగి తన పక్కింట్లో ఉండే వ్యక్తిని, అతడి కొడుకుని కొట్టాడని పిర్యాదు అందటంతో వారిద్దరూ కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భారత్ తరఫు ఆరు టెస్టులు, 68 వన్డేలు ఆడిన ప్రవీణ్ కుమార్ 104 వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment