
మిథాలీ సేన బ్యాటింగ్
డెర్బీ:మహిళల వన్డే వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ బేట్స్ భారత్ ను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది.
గత రెండు మ్యాచ్‌ల పరాభవం భారత మహిళలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచినప్పటికీ నాకౌట్ చేరాలంటే న్యూజిలాండ్‌పై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాటింగ్ ఆర్డర్ తిరిగి గాడిన పడితేనే కివీస్‌ను పడేయొచ్చు. లేదంటే టీమిండియాకు మరోసారి లీగ్ దశతోనే ప్రపంచ కప్ ముచ్చట ముగుస్తుంది. ఒకవేళ వరుణుడు కరుణించి మ్యాచ్ రద్దయితే మాత్రం భారత్‌కు సెమీఫైనల్ బెర్త్ లభిస్తుంది.
మహిళల ప్రపంచకప్‌లో ఇంకా లీగ్ దశ ముగియలేదు.. కానీ భారత్ మాత్రం నాకౌట్‌కు ముందే నాకౌట్ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ టోర్నీలో ఇప్పటికే ఆతిథ్య ఇంగ్లండ్‌తో పాటు డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, దక్షిణా ఫ్రికా జట్లు సెమీఫైనల్‌కు చేరా యి. దీంతో మిగిలున్న ఒక బెర్త్ కోసం భారత్, కివీస్‌లు హోరాహోరీ పోరుకు సై అంటున్నాయి. ప్రస్తుతం భారత్ ఖాతాలో 8, న్యూజిలాండ్ ఖాతాలో 7 పాయింట్లున్నాయి. వర్షం కారణంగా నేటి మ్యాచ్ రద్దయితే మాత్రం రెండు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ 9 పాయింట్లతో సెమీఫైనల్‌కు చేరుకుంటుంది.