
బ్రె ‘జూలు’ విదిల్చింది
పాయింట్ సాధిస్తేచాలు నాకౌట్ దశకు అర్హత సాధిస్తుందని తెలిసినా బ్రెజిల్ జట్టు భారీ విజయమే లక్ష్యంగా పోరాడింది. ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ అనుకున్నది సాధించింది.
‘సెంచరీ’ మ్యాచ్‌లో కామెరూన్‌పై 4-1తో విజయం
ప్రిక్వార్టర్స్‌కు అర్హత
గ్రూప్ ‘ఎ’లో అగ్రస్థానం
రెండు గోల్స్‌తో మెరిసిన నెయ్‌మార్
బ్రెసిలియా: పాయింట్ సాధిస్తేచాలు నాకౌట్ దశకు అర్హత సాధిస్తుందని తెలిసినా బ్రెజిల్ జట్టు భారీ విజయమే లక్ష్యంగా పోరాడింది. ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ అనుకున్నది సాధించింది. వరుసగా రెండు ఓటములతో డీలా పడిన కామెరూన్‌ను ఓ ఆటాడించిన బ్రెజిల్.. లీగ్ దశను విజయంతో ముగించింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రపంచకప్ గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య బ్రెజిల్ జట్టు 4-1 గోల్స్ తేడాతో కామెరూన్‌ను చిత్తు చేసింది.
బెజిల్ తరఫున రైజింగ్ సూపర్‌స్టార్ నెయ్‌మార్ రెండు గోల్స్ చేయగా... ఫ్రెడ్, ఫెర్నాన్‌డినో ఒక్కో గోల్ సాధించారు. కామెరూన్‌కు మాటిప్ ఏకైక గోల్‌ను అందించాడు. ఏడు పాయింట్లతో బ్రెజిల్, మెక్సికో సమంగా నిలిచినా... మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా బ్రెజిల్‌కు అగ్రస్థానం దక్కింది. జూన్ 28న జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో చిలీతో బ్రెజిల్; జూన్ 29న జరిగే ప్రిక్వార్స్‌లో నెదర్లాండ్స్‌తో మెక్సికో తలపడతాయి.
ప్రపంచకప్ చరిత్రలో 100వ మ్యాచ్ ఆడిన బ్రెజిల్ కళ్లు చెదిరే ఆటతో అలరించింది. ళి ఆరంభం నుంచి సమన్వయంతో కదిలిన బ్రెజిల్‌కు 17వ నిమిషంలో ఫలితం లభించింది. ఎడమవైపు నుంచి లూయిజ్ గుస్తావో ఇచ్చిన పాస్‌ను ‘డి’ బాక్స్ మధ్యలో ఉన్న నెయ్‌మార్ గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. దాంతో బ్రెజిల్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
అయితే ఎనిమిది నిమిషాలు గడిచాక కామెరూన్ స్కోరును సమం చేసి ఆశ్చర్యపరిచింది. ఎన్‌యో మ్ క్రాస్ షాట్‌ను మాటిప్ గోల్‌గా మలిచాడు.
స్కోరు సమం కావడంతో బ్రెజిల్ ఆటగాళ్లు జోరు పెంచారు. ఆ ఆటగాళ్ల కృషికితోడు కామెరూన్ జట్టు రక్షణపంక్తి బలహీనతలు బ్రెజిల్‌కు కలిసొచ్చాయి. చాలాసార్లు మ్యాచ్‌లో కామెరూన్ ఆటగాళ్లు బ్రెజిల్ ఆటగాళ్లకే పాస్‌లు ఇచ్చారు.
బ్రెజిల్ చేసిన రెండో గోల్ ఇలాగే వచ్చింది. ఎన్‌యోమ్ తమ ఆధీనంలో ఉన్న బంతిపై నియంత్రణ కోల్పోగా... బంతిని అందుకున్న బ్రెజిల్ ప్లేయర్ మార్సెలో.. నెయ్‌మార్‌కు పాస్ ఇచ్చాడు. అతను ప్రత్యర్థి ఆటగాళ్లను తప్పిస్తూ బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. విరామానికి బ్రెజిల్ 2-1తో ఆధిక్యంలో వెళ్లింది.
ద్వితీయార్ధంలోనూ బ్రెజిల్‌దే ఆధిపత్యం కనిపించింది. 49వ నిమిషంలో లభించిన కార్నర్ కిక్‌ను ఫ్రెడ్ గోల్‌గా మలిచాడు. 84వ నిమిషంలో ఫెర్నాన్‌డినో నాలుగో గోల్‌ను అందించాడు.