భారత్‌లో క్రికెట్ మచ్చలేకుండా కొనసాగాలంటే బీసీసీఐ సక్రమంగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
బీసీసీఐ ఆఫీస్ బేరర్లపై సుప్రీం కోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ: భారత్‌లో క్రికెట్ మచ్చలేకుండా కొనసాగాలంటే బీసీసీఐ సక్రమంగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. బోర్డు అధికారులెవరైనా సచ్ఛీలురుగా, ఎలాంటి అనుమానాస్పద వ్యవహార శైలి లేకుండా ఉండాలని స్పష్టం చేసింది. ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసు విచారణ సందర్భంగా సోమవారం జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ కలీఫుల్లాలతో కూడిన బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ క్రమంలో ఐపీఎల్ విషయంలో తనకు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు లేవని ఎన్.శ్రీనివాసన్ చేసిన అప్పీల్‌ను అంగీకరించడం చాలా కష్టమని కోర్టు తెలిపింది. అయితే ప్రపంచ క్రీడారంగంలో పరస్పన ప్రయోజనాలు అనేవి సాధారణంగా జరుగుతూనే ఉంటాయని... హాకీ సమాఖ్య, ఫిఫా దీనికి అంగీకరిస్తున్నాయని శ్రీనివాసన్ కౌన్సిల్ కపిల్ సిబల్ వాదించారు. మరోవైపు బీసీసీఐ ఎన్నికలకు తాము అంగీకరిస్తే అందులో ఎవరు పోటీ చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ మంగళవారం కొనసాగుతుంది.
బోర్డు తాత్కాలిక అధ్యక్షుడిగా శివలాల్ యాదవ్‌ను నియమించడాన్ని హైదరాబాద్ రంజీ మాజీ ఆటగాడు ఒకరు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దీనిని కూడా ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.