షెహజాద్ వ్యాఖ్యలు మతిలేనివి: పీసీబీ | PCB chief terms Ahmed Shehzad’s religious advice to Tillakaratne Dilshan as ‘stupid’ | Sakshi
Sakshi News home page

షెహజాద్ వ్యాఖ్యలు మతిలేనివి: పీసీబీ

Published Sat, Sep 6 2014 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 12:55 PM

PCB chief terms Ahmed Shehzad’s religious advice to Tillakaratne Dilshan as ‘stupid’

న్యూఢిల్లీ: తమ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అది తెలివితక్కువతనంతో చేసిన పనిగా విమర్శించారు. శ్రీలంక క్రికెటర్ దిల్షాన్‌తో షెహజాద్ చేసిన మతపరమైన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ‘మైదానంలో మతం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అదీ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఇలా ప్రవర్తించడం నిజంగా మూర్ఖత్వం. ఆ వ్యాఖ్యలు స్నేహపూర్వకంగానే చేసినా తప్పే.
 
 ఇప్పటికే ఈ ఘటనపై త్రిసభ్య కమిటీని నియమించాం. మా క్రమశిక్షణ కమిటీ మరోసారి ఇలాంటి చర్యలు జరగకుండా చూస్తుంది. అయితే శ్రీలంక క్రికెట్ బోర్డు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. వారిది నిజంగా సరైన నిర్ణయం’ అని ఖాన్ అన్నారు. మరోవైపు షెహజాద్ విషయాన్ని దిల్షాన్ తేలిగ్గా తీసుకున్నాడు. ఆ సమయంలో తానేం మాట్లాడానో కూడా గుర్తులేదన్నాడు.
 
 26/11 పై తేలాకే సిరీస్‌లు జరగవచ్చు!
 ముంబైలో 2008లో జరిగిన 26/11 దాడుల కేసు పూర్తిగా ముగిసే వరకు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహణ కష్టమేనని పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ అన్నారు. ఈ నెలలో జరిగే చాంపియన్స్ లీగ్‌లో లాహోర్ లయన్స్ పాల్గొనే అంశంపై కూడా ఇంకా స్పష్టత లేదని ఖాన్ అన్నారు. ఒక వేళ లాహోర్ జట్టు భారత్‌లో ఆడకపోతే... వచ్చే ఎనిమిదేళ్లలో ఇరు జట్ల మధ్య నిర్వహించాలని ప్రతిపాదిస్తున్న సిరీస్‌లపై కూడా దీని ప్రభావం పడవచ్చని ఆయన అన్నారు. అక్టోబరులో జరిగే ఐసీసీ సమావేశంలో బీసీసీఐ అధికారులతో తాను మరింత వివరంగా చర్చించాల్సి ఉందని షహర్యార్ వెల్లడించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement