
ఇస్లామాబాద్: కరోనా లాక్‌డౌన్ కారణంగా కుటుంబానికి దూరమైన షోయబ్ మాలిక్ విన్నపాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మన్నించింది. ఇంగ్లండ్ పర్యటనకు ముందు హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన భార్య, పిల్లలతో గడిపేందుకు ప్రత్యేక అనుమతినిచ్చింది. మానవతా కోణంలోనే ఈ వెసులుబాటు కల్పించినట్టు పీసీబీ చైర్మన్ వసీం ఖాన్ పేర్కొన్నారు. కాగా, ఐదు నెలల క్రితం భారత్‌కు వచ్చిన సానియా మీర్జా లాక్‌డౌన్ విధించడంతో ఇక్కడే చిక్కుకుపోయారు. ఎప్పుడూ బిజీబిజీగా గడిపే తాము లాక్‌డౌన్ వేళలో కూడా ఒకే దగ్గర ఉండలేక పోయినందుకు ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
(చదవండి: అప్పుడే నా మనసు ఆనందంగా ఉంటుంది: సానియా)
బయో సెక్యూర్‌గా మ్యాచ్‌లు
ఆగస్టు-సెప్టెంబర్‌లో ఇంగ్లండ్-పాక్ మధ్య మూడు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్‌లతో సిరీస్‌లు జరుగనున్నాయి. ఇందుకోసం 28 మంది ఆటగాళ్లతో పాకిస్తాన్ క్రికెట్ టీమ్ జూన్ 28న ఇంగ్లండ్ బయల్దేరనుంది. కోవిడ్ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లన్నీ బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు పీసీబీ తెలిపింది. పాక్ ఆటగాళ్లు 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న తర్వాత మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఇక జూలై 24న షోయబ్ జట్టుతో కలుస్తాడని పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, 38 ఏళ్ల షోయబ్ టెస్టు, వన్డే ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. టీ20లో మాత్రమే అతడు కొనసాగుతున్నాడు.
(చదవండి: వీడియో షేర్ చేసిన హర్భజన్.. షాకిస్తున్న ఫ్యాన్స్!)
Comments
Please login to add a commentAdd a comment