
రెజ్లర్ వివాదంపై వివరాలు ఇవ్వండి: మోదీ
న్యూఢిల్లీ:డోపింగ్ టెస్టులో విఫలమైన భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ వివాదం ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు చేరింది. డోపింగ్ టెస్టులో నర్సింగ్ విఫలం కావడం, ఆపై అది కాస్త తీవ్ర దుమారం రేపడంతో మోదీ స్పందించారు. ఆ వివాదానికి సంబంధించిన వివరాలను తనకు అందజేయాలంటూ భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ను కోరారు. ఈ మేరకు భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కలిసిన మోదీ.. ప్రస్తుత వివాదం గురించి అడిగి తెలుసుకున్నారు. దీనిలో భాగంగా ఆ వివరాలను తక్షణమే తనకు పంపాలంటూ బ్రిజ్ భూషణ్ కు తెలియజేశారు.
రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ (74 కేజీలు) డోపింగ్ పరీక్షలో పట్టుబడిన సంగతి తెలిసిందే. హరియాణాలోని సోనేపట్ భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో నర్సింగ్‌కు నిర్వహించిన డోపింగ్ పరీక్షలో అతను విఫలమయ్యాడు. అతని నుంచి సేకరించిన నమూనాలో నిషేధిత ఉత్ప్రేరకం మెథాన్‌డైనన్ వాడినట్లు తేలిందని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నర్సింగ్ యాదవ్ రియోకు వెళ్లడంపై సందిగ్ధత ఏర్పడింది. మరోవైపు తనను రియోకు వెళ్లకుండా చేయడానికి కుట్ర జరిగిందని నర్సింగ్ ఆరోపిస్తున్నాడు. తాను ఎటువంటి నిషేధిత డ్రగ్స్ తీసుకోలేదని, ఎవరో కావాలనే తన భోజనంలో డ్రగ్స్ కలిపి ఇరికించే యత్నం చేసి ఉంటారని నర్సింగ్ అనుమానిస్తున్నాడు.