
పోర్చుగల్ ఆశలు సజీవం
మ్యాచ్ ముగిసేందుకు మరో 25 సెకన్లు మాత్రమే ఉంది... అమెరికా 2-1తో ఆధిక్యంలో ఉంది.... ఈ దశలో క్రిస్టియానో రొనాల్డో లాంటి అత్యుత్తమ ఆటగాడు జట్టులో ఉన్నప్పటికీ పోర్చుగల్ పని అయిపోయిందనే అంతా భావించారు.
అమెరికాతో మ్యాచ్ 2-2తో డ్రా
మనౌ: మ్యాచ్ ముగిసేందుకు మరో 25 సెకన్లు మాత్రమే ఉంది... అమెరికా 2-1తో ఆధిక్యంలో ఉంది.... ఈ దశలో క్రిస్టియానో రొనాల్డో లాంటి అత్యుత్తమ ఆటగాడు జట్టులో ఉన్నప్పటికీ పోర్చుగల్ పని అయిపోయిందనే అంతా భావించారు. వరుసగా రెండు పరాజయాలతో ఈ జట్టు గ్రూప్ దశ నుంచే నిష్ర్కమించడం ఖాయమనే అనుకున్నారు.
కానీ ఈ దశలో అద్భుతం జరిగింది. రొనాల్డో ఇచ్చిన నమ్మశక్యంకాని పాస్‌ను అందుకున్న సబ్‌స్టిట్యూట్ సిల్విస్టర్ వరేలా డైవ్ చేస్తూ హెడర్ గోల్ సాధించి తమ శిబిరంలో అంతులేని ఆనందాన్ని నింపాడు. దీంతో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ గ్రూప్ జి మ్యాచ్‌ను పోర్చుగల్ 2-2తో డ్రాగా ముగించి నాకౌట్ ఆశలను నిలుపుకుంది.
పోర్చుగల్ తరఫున మరో గోల్ నాని చేయగా... అమెరికా తరఫున జోన్స్, డెంప్సీ గోల్స్ సాధించారు.
* మ్యాచ్ ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే నాని పోర్చుగల్ తరఫున గోల్స్ ఖాతా తెరిచాడు.
* 64వ నిమిషంలో అమెరికా స్కోరు సమం చేసింది. గ్రాహం కార్నర్ కిక్‌ను జెర్మైన్ జోన్స్ గురి తప్పకుండా గోల్ పోస్టులోనికి పంపాడు.
* ఇదే జోరులో అమెరికా మ్యాచ్‌పై పట్టు సాధించింది. 81వ నిమిషంలో జుసీ షాట్ వెనక్కిరాగా స్ట్రయికర్ క్లింట్ డెంప్సీ తన కడుపు భాగంతో గోల్‌పోస్ట్‌లోనికి పంపాడు.
* ఇక అంతా అయిపోయిందనుకున్న తరుణంలో చివరి నిమిషంలో రొనాల్డో తన కుడి కాలితో బంతిని గాల్లోకి లేపి ఇచ్చిన పాస్‌ను వరేలా లక్ష్యానికి చేర్చి అమెరికన్లను షాక్‌కు గురిచేశాడు.
పోర్చుగల్ రెచ్చిపోతేనే...
పోర్చుగల్ నాకౌట్‌కు వెళ్లేందుకు ద్వారాలు తెరిచే ఉన్నా ఈ జట్టు తమ చివరి మ్యాచ్‌లో ఘనాను భారీ తేడాతో ఓడించాల్సి ఉంటుంది. జర్మనీతో చిత్తుగా ఓడినందుకు ఫలితమిది. అమెరికా తమ చివరి మ్యాచ్‌ను జర్మనీ చేతిలో ఒక్క గోల్ కూడా చేయకుండా ఓడితే... అటు రొనాల్డో బృందం 3-0తో గెలవాల్సి ఉంటుంది. అలాగైతేనే అమెరికాతో సమానంగా నాలుగు పాయింట్లకు చేరి... ఓవరాల్ గోల్స్ తేడాతో పోర్చుగల్ నాకౌట్‌కు వెళుతుంది. ఇదే సమయంలో పోర్చుగల్‌పై గెలిస్తే ఘనాకు కూడా అవకాశం ఉంటుంది.