నాదల్‌కే 'ఫ్రెంచ్‌' కిరీటం... | Rafael Nadal claims record-extending 11th French Open title | Sakshi
Sakshi News home page

నాదల్‌కే 'ఫ్రెంచ్‌' కిరీటం...

Published Mon, Jun 11 2018 1:28 AM | Last Updated on Mon, Jun 11 2018 8:51 AM

Rafael Nadal claims record-extending 11th French Open title - Sakshi

ఎలాంటి అద్భుతం జరగలేదు. సంచలనం చోటు చేసుకుంటుందని ఏ క్షణానా అనిపించలేదు. క్లే కోర్టులపై మకుటం లేని మహారాజుగా తన పేరును చిరస్మరణీయం చేసుకుంటూ... స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ 11వసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ ట్రోఫీని ముద్దాడాడు. ఇతర క్లే కోర్టు టోర్నీలలో తనపై విజయాలు సాధించినా... ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్స్‌లో అలాంటి ఫలితాన్ని పునరావృతం చేయడం ఇప్పట్లో అసాధ్యమేనని నిరూపించాడు. గత 13 ఏళ్లలో ఈ ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఫైనల్‌కు చేరిన 11 సార్లూ అజేయంగా నిలిచి క్లే కోర్టులపై తాను ఎదురులేని మొనగాడినని చాటుకున్నాడు. గత రెండేళ్లలో క్లే కోర్టులపై నాదల్‌ను ఓడించిన ఏకైక ప్లేయర్‌ డొమినిక్‌ థీమ్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీకొచ్చేసరికి వరుస సెట్‌లలో చేతులెత్తేశాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ అంతిమ సమరంలో నాదల్‌ చేతిలో ఎదురైన పరాజితుల జాబితాలో ఏడో క్రీడాకారిడిగా చేరిపోయాడు.   

పారిస్‌: గతంలో ఎవరివల్లా కానిది డొమినిక్‌ థీమ్‌ వల్ల కూడా కాలేదు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో 11వసారీ రాఫెల్‌ నాదలే రాజ్యమేలాడు. రికార్డుస్థాయిలో 11వసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం 2 గంటల 42 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ పోరులో టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ నాదల్‌ 6–4, 6–3, 6–2తో ఏడో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా)ను ఓడించాడు. విజేతగా నిలిచిన 32 ఏళ్ల నాదల్‌కు 22 లక్షల యూరోలు (రూ. 17 కోట్ల 48 లక్షలు), రన్నరప్‌ డొమినిక్‌ థీమ్‌కు 11 లక్షల 20 వేల యూరోలు (రూ. 8 కోట్ల 90 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 
గత రెండేళ్లలో క్లే కోర్టులపై నాదల్‌ను ఓడించిన ఏకైక ప్లేయర్‌ థీమ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మాత్రం స్పెయిన్‌ స్టార్‌ ముందు ఎదురు నిలువలేకపోయాడు. మ్యాచ్‌ మొత్తంలో కేవలం మూడుసార్లు మాత్రమే నాదల్‌ సర్వీస్‌లో బ్రేక్‌ పాయింట్‌ అవకాశాలను రాబట్టుకున్న అతను తొలి సెట్‌లో ఒక్కసారి మాత్రమే దానిని సద్వినియోగం చేసుకున్నాడు. మరోవైపు థీమ్‌ సర్వీస్‌లలో 17సార్లు బ్రేక్‌ పాయింట్‌ అవకాశాలను సంపాదించిన నాదల్‌ ఐదుసార్లు వాటిని అనుకూలంగా మల్చుకున్నాడు. నెట్‌ వద్దకు నాదల్‌ 18 సార్లు దూసుకొచ్చి 16 సార్లు పాయింట్లు పొందగా... థీమ్‌ 15 సార్లు అలా చేసి ఎనిమిదిసార్లు మాత్రమే సఫలమయ్యాడు. అనవసర తప్పిదాల విషయానికొస్తే నాదల్‌ 24 చేయగా... థీమ్‌ రాకెట్‌ నుంచి 42 రావడం గమనార్హం.  

మేఘావృత వాతావరణంలో మొదలైన ఫైనల్లో తొలి సెట్‌ రెండో గేమ్‌లోనే థీమ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన నాదల్‌ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే మూడో గేమ్‌లో తన సర్వీస్‌ కాపాడుకొని, నాలుగో గేమ్‌లో నాదల్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన థీమ్‌ స్కోరును 2–2తో సమం చేశాడు. ఆ తర్వాత తొమ్మిదో గేమ్‌లో నాదల్‌ సర్వీస్‌ కాపాడుకొని 5–4తో ముందంజ వేశాడు. పదో గేమ్‌లో థీమ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 61 నిమిషాల్లో నాదల్‌ తొలి సెట్‌ను 6–4తో దక్కించుకున్నాడు.  రెండో సెట్‌లోనూ పరిస్థితిలో మార్పు కనిపించలేదు. అడపాదడపా థీమ్‌ మెరుపులు కనిపించినా కీలకదశలో నాదల్‌దే పైచేయిగా నిలిచింది. రెండో గేమ్‌లోనే థీమ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన నాదల్‌ ఆ తర్వాత సర్వీస్‌లను కాపాడుకొని రెండో సెట్‌నూ  ఖాతాలో వేసుకున్నాడు. మూడో సెట్‌లో నాదల్‌ మరింత జోరు పెంచగా థీమ్‌ డీలా పడిపోయాడు. ఎనిమిదో గేమ్‌లో థీమ్‌ కొట్టిన రిటర్న్‌ షాట్‌ బయటకు వెళ్లడంతో నాదల్‌ విజయం ఖాయమైంది.  

►17 నాదల్‌ గెలిచిన గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌. ఇందులో 11 ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్స్‌ కాగా... మూడు యూఎస్‌ ఓపెన్‌ (2010, 2013, 2017), రెండు వింబుల్డన్‌ (2008, 2010), ఒక ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ (2009) టైటిల్స్‌ ఉన్నాయి. ఫెడరర్‌ అత్యధికంగా 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించాడు.  

1 టెన్నిస్‌ చరిత్రలో మూడు వేర్వేరు టోర్నీలను 11 సార్లు  గెలిచిన ఏకైక ప్లేయర్‌ నాదల్‌. బార్సిలోనా ఓపెన్, మోంటెకార్లో టోర్నీ టైటిల్స్‌ను కూడా నాదల్‌ 11 సార్ల చొప్పున నెగ్గాడు. 

►2 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నాదల్‌ ఓడిన మ్యాచ్‌లు. 2005 నుంచి ఈ టోర్నీ లో ఆడుతున్న నాదల్‌ ఇప్పటివరకు 87 మ్యాచ్‌ల్లో గెలిచాడు. 2009 ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సోడెర్లింగ్‌ (స్వీడన్‌) చేతిలో... 2015లో క్వార్టర్స్‌లో జొకోవిచ్‌ (సెర్బియా) చేతిలో మాత్రమే నాదల్‌ ఓడిపోయాడు. 2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018లలో నాదల్‌ విజేతగా నిలిచాడు.  

►6 తాను ఆడిన 11 ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్స్‌లో నాదల్‌ తన ప్రత్యర్థులకు కోల్పోయిన సెట్‌ల సంఖ్య. పుయెర్టా (అర్జెంటీనా–2005లో), ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌–2006, 2007, 2011లో), జొకోవిచ్‌ (సెర్బియా–2012, 2014లో) మాత్రమే నాదల్‌పై ఒక్కో సెట్‌ గెలవగలిగారు. సోడెర్లింగ్, ఫెరర్, వావ్రింకా, థీమ్‌ మాత్రం వరుస సెట్‌లలో ఓడిపోయారు.  

►2 టెన్నిస్‌ చరిత్రలో ఒకే గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ను 11 సార్లు గెలిచిన రెండో ప్లేయర్‌ నాదల్‌. గతంలో ఆస్ట్రేలియా క్రీడాకారిణి మార్గరెట్‌ కోర్ట్‌ 1960 నుంచి 1973 మధ్య కాలంలో 11 సార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను సాధించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement