
న్యూఢిల్లీ: మైదానంలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు కోపమొచ్చింది. ఇందుకు కారణం తన పేరును ఎవరో ఒక వ్యక్తి తప్పుగా పలకడమే. శ్రీలంకతో మూడో టెస్టు మ్యాచ్ తరువాత తనకు వద్దకు వచ్చిన సదరు అభిమాని 'అజయ్.. నీ ప‍్రదర్శన బాగుంది.. బౌలింగ్ బాగా వేశావ్. ప్రధానంగా చివరి మ్యాచ్‌లో బౌలింగ్ చాలా బాగుంది' అనడమే జడేజా కోపానికి కారణం. 'నేను తొమ్మిదేళ్ల నుంచి దేశం తరపున క్రికెట్ ఆడుతున్నా. కనీసం నా పేరు ఇంకా తెలియడం లేదు. నా పేరు అజయ్ కాదు.. రవీంద్ర జడేజా' అని ట్వీట్ ద్వారా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.
భారత్ తరపున జడేజా ఇప్పటివరకూ 34 టెస్టులు ఆడగా, 136 వన్డేలు, 40 అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టులో 165 వికెట్లు సాధించిన జడేజా.. వన్డేల్లో 155 వికెట్లు, టీ 20ల్లో 31 వికెట్లు తీశాడు. అయితే బుధవారం 29వ పుట్టినరోజు జరుపుకున్న తన వద్దకు ఒక అభిమాని వచ్చి విషెస్ చెప్పే క్రమంలో అజయ్ అంటూ సంబోధించడం జడేజాను చిన్నబుచ్చినట్లు అయ్యింది. దాంతో తన పేరు అజయ్ కాదు.. రవీంద్ర జడేజా అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
మనకు మాజీ క్రికెటర్ అజయ్ జడేజా గురించి తెలిసే ఉంటుంది. 1992-2000 వరకూ భారత్ జట్టులో రెగ్యులర్ సభ్యునిగా అజయ్ జడేజా కొనసాగాడు. ఇక్కడ సదరు అభిమాని పొరపాటున రవీంద్ర జడేజాకు బదులు అజయ్ జడేజా పేరును పలికి ఉండవచ్చు.