నవ్వులు పూయించిన జడేజా!
గాలే: మహేంద్ర సింగ్ ధోని చేత 'సర్'అనిపించుకున్నా, మైదానంలో బ్యాట్ను తల్వార్ లా తిప్పుతూ కత్తి డ్యాన్స్ చేసినా అది మన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకే చెల్లింది. మరొకవైపు తనకు అవకాశం వచ్చినప్పుడల్లా ఆటగాళ్లను ఆట పట్టించడం జడేజాకు సరదా. శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో మరొకసారి తన చిలిపితనాన్ని ప్రదర్శించాడు.
బుధవారం శ్రీలంక బౌలర్లను భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఉతికి ఆరేస్తున్న సమయంలో్ జడేజా ఆఫ్ ఫీల్డ్ యాక్షన్ తో ఆకట్టుకున్నాడు. ఇక్కడ శ్రీలంక బౌలర్ల యాక్షన్ ను జడేజా అనుకరించి భారత బృందంలో నవ్వులు పూయించాడు. శ్రీలంక బౌలర్లు ఇలా బౌలింగ్ చేస్తున్నారంటూ యాక్ట్ చేసి మరీ చూపించాడు. జడేజా ఆకస్మిక యాక్షన్ కు కెప్టెన్ విరాట్ కోహ్లితో సహా కోచ్ రవిశాస్త్రి సైతం పగలబడి నవ్వడమే తరువాయి అయ్యింది. అరే జడేజా మరీ చిలిపి అని పక్కనున్న వారు అనుకునేలా చేశాడు.
లంకేయులతో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా గురువారం రెండో రోజు లంచ్ సమయానికి భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 503 పరుగులు చేసింది. ఈ రోజు ఆటలో చటేశ్వర పుజారా(153), రహానే(57), సాహా(16), అశ్విన్(47)లు పెవిలియన్ చేరారు.