
నంబర్‌వన్ ట్రోఫీతో ఫెడరర్
రోటర్‌డామ్ (నెదర్లాండ్స్): యువ ఆటగాళ్లకు దీటుగా ఆడుతూ... సమకాలీకులపై పూర్తి ఆధిప త్యం చలాయిస్తూ... స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ పూర్వ వైభవాన్ని అందుకున్నాడు. గతేడాది అందర్నీ ఆశ్చర్యపరుస్తూ రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఫెడరర్ ఈ సీజన్‌లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. గత నెలలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను నిలబెట్టుకున్న అతను తాజాగా రోటర్‌డామ్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకొని మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ 4–6, 6–1, 6–1తో రాబిన్ హాస్ (నెదర్లాండ్స్)ను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. తద్వారా సోమవారం విడుదల చేసే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ఈ స్విస్ స్టార్ మళ్లీ టాప్ ర్యాంక్‌ను అందుకోనున్నాడు. 26 వారా లుగా నంబర్‌వన్ స్థానంలో ఉన్న రాఫెల్ నాదల్ (స్పెయిన్) రెండో ర్యాంక్‌కు పడిపోనున్నాడు.
►అగ్రస్థానానికి చేరుకున్న క్రమంలో ఫెడరర్ తన పేరిట ఎన్నో ఘనతలు లిఖించుకున్నాడు. పురుషుల సింగిల్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకున్న పెద్ద వయస్కుడిగా (36 ఏళ్ల 6 నెలల 11 రోజులు) ఫెడరర్ గుర్తింపు పొందాడు. గతంలో ఈ రికార్డు ఆండ్రీ అగస్సీ (33 ఏళ్లు; అమెరికా 2003లో) పేరిట ఉండేది.
►కోల్పోయిన టాప్ ర్యాంక్‌ను మళ్లీ అందుకునేందుకు ఎక్కువ విరామం (5 ఏళ్ల 106 రోజులు) తీసుకున్న ప్లేయర్‌గానూ ఫెడరర్ రికార్డు నెలకొల్పాడు. 2012 నవంబర్ 4న నంబర్‌వన్ ర్యాంక్ చేజార్చుకున్న ఫెడరర్ ఈనెల 19న మళ్లీ దానిని అందుకోనున్నాడు.
► తన కెరీర్‌లో 2004 ఫిబ్రవరి 2న తొలిసారి నంబర్‌వన్ అయిన ఫెడరర్ రికార్డుస్థాయిలో వరుసగా 237 వారాలు ఆ స్థానంలో ఉన్నాడు. 2008 ఆగస్టు 17న టాప్ ర్యాంక్ కోల్పోయిన అతను మళ్లీ రెండుసార్లు (2009 జూలై 6 నుంచి 2010 జూన్ 6 వరకు; 2012 జూలై 9 నుంచి 2012 నవంబర్ 4 వరకు) శిఖరాగ్రానికి చేరుకున్నాడు.
టెన్నిస్‌లో నంబర్‌వన్ ర్యాంక్ అందుకోవడమనేది ఎవరైనా అత్యుత్తమ ఘనతగా భావిస్తారు. అద్భుతంగా ఆడుతున్న సమయంలో అనుకోకుండా అగ్రస్థానానికి వస్తాం. ఆ తర్వాత దానిని నిలబెట్టుకోవాలని తీవ్రంగా శ్రమించే క్రమంలో వేరే వాళ్లకు కోల్పోతాం. వయసు పెరిగేకొద్దీ మళ్లీ ఆ ర్యాంక్‌ను అందుకోవాలంటే రెండురెట్లు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ విషయంలో నేను మళ్లీ విజయవంతం అయ్యాను. మరోసారి నా కల నిజమైందని భావిస్తున్నాను. తిరిగి టాప్ ర్యాంక్ అందుకుంటున్నానంటే నాకే నమ్మశక్యంగా లేదు.
– ఫెడరర్
Comments
Please login to add a commentAdd a comment