
విశాఖపట్నం: ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారీ శతకంతో చెలరేగిపోయిన రోహిత్ శర్మ మరో రికార్డును సమం చేసేందుకు అడుగుదూరంలో నిలిచాడు. గత మ్యాచ్‌లో ఎనిమిది సిక్సర్లు బాదిన రోహిత్.. మరో సిక్సర్ కొడితే భారత్ తరపున వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో సచిన్ టెండూల్కర్ సరసన చేరతాడు. ఇప్పటివరకూ వన్డేల్లో 194 సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ.. సచిన్ సిక్సర్ల రికార్డును చేరేందుకు స్వల్ప దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం వన్డేల్లో సచిన్ 195 సిక్సర్లతో రెండో స్థానంలో ఉండగా, రోహిత్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత క్రికెటర్ల జాబితాలో సౌరవ్ గంగూలీ (190)ను రోహిత్ వెనక్కి నెట్టిన సంగతి తెలిసిందే.
విండీస్‌తో బుధవారం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో సచిన్ సిక్సర్లు రికార్డును ‘హిట్ మ్యాన్’ అధిగమించే అవకాశాలు కనబడుతున్నాయి. కొంతకాలంగా బ్యాటింగ్ మంచి ఊపుమీద ఉన్న రోహిత్.. విశాఖ వన్డేల్లో కూడా అదే జోరును కొనసాగించే అవకాశం ఉంది. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో మహేంద్ర సింగ్ ధోని (217) తొలి స్థానంలో ఉన్నాడు.