సెంచరీల సరదాట | Rohit Sharma, Virat Kohli slam centuries as India crush Windies by 8 wickets | Sakshi
Sakshi News home page

సెంచరీల సరదాట

Published Mon, Oct 22 2018 4:43 AM | Last Updated on Mon, Oct 22 2018 5:04 AM

Rohit Sharma, Virat Kohli slam centuries as India crush Windies by 8 wickets - Sakshi

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి

ఆటలో, పరుగుల వేటలో కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. వన్డేల్లో తమ అద్భుత ఆటను, ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శిస్తూ ఇద్దరు స్టార్లు కదం తొక్కిన వేళ... 323 పరుగుల లక్ష్యం కూడా చాలా చిన్నదిగా మారిపోయింది. ఒకరితో మరొకరు పోటీ పడుతూ, ఒక్కో పరుగుతో కొత్త రికార్డులు సృష్టిస్తూ విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ వీర విధ్వంసం సృష్టించడంతో బర్సపర స్టేడియంలో పరుగుల వర్షం కురిసింది. రోహిత్, కోహ్లి కలిసి 36 ఫోర్లు, 10 సిక్సర్లతో 204 పరుగులు బౌండరీల ద్వారానే సాధించేస్తే ఆ మ్యాచ్‌లో వినోదానికి లోటేముంటుంది.

పరుగులు చేయడం ఇంత సులువా అన్నట్లుగా వీరిద్దరు అతి సునాయాసంగా ఫోర్లు, సిక్సర్లు బాదేస్తుంటే విండీస్‌కు చాలా ముందే ఓటమి కళ్ల ముందు కనిపించేసింది. కోహ్లికి 60వ అంతర్జాతీయ శతకం అలవోకగా ఒళ్లో వచ్చి వాలితే... రోహిత్‌ ఆరోసారి 150 పరుగులు దాటిన తొలి ఆటగాడయ్యాడు. జంటగా చూస్తే ఐదోసారి 200 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన ఈ జోడీ తొలి వన్డేలో ఆహా అనిపించే విజయాన్ని అందించింది.   

గువాహటి: టెస్టు సిరీస్‌ తరహాలోనే వన్డేల్లోనూ భారత్‌ భారీ విజయంతో శుభారంభం చేసింది. ఆదివారం ఇక్కడి బర్సపర స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. షిమ్రాన్‌ హెట్‌మైర్‌ (78 బంతుల్లో 106; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) కెరీర్‌లో మూడో సెంచరీ సాధించగా, కీరన్‌ పావెల్‌ (39 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేశాడు. చహల్‌ 41 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్‌ 42.1 ఓవర్లలో 2 వికెట్లకు 326 పరుగులు చేసి విజయాన్నందుకుంది. రోహిత్‌ శర్మ (117 బంతుల్లో 152 నాటౌట్‌; 15 ఫోర్లు, 8 సిక్సర్లు), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ విరాట్‌ కోహ్లి (107 బంతుల్లో 140; 21 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ శతకాలతో భారత్‌ను గెలిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 246 పరుగులు జోడించడం విశేషం. తాజా ఫలితంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1–0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే బుధవారం విశాఖపట్నంలో జరుగుతుంది.  

హెట్‌మైర్‌ జోరు...
టెస్టుల్లో ఘోర వైఫల్యం తర్వాత హెట్‌మైర్‌ కొత్త తరహా ఆట... మూడు అర్ధసెంచరీ భాగస్వామ్యాలు కలిసి బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై విండీస్‌కు భారీ స్కోరు అందించాయి. తొలి వన్డే ఆడుతున్న చంద్రపాల్‌ హేమ్‌రాజ్‌ (9)ను షమీ క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో విండీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఈ స్థితిలో కీరన్‌ పావెల్, షై హోప్‌ (51 బంతుల్లో 32; 2 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 65 పరుగులు జోడించారు. ఈ క్రమంలో దూకుడుగా ఆడిన పావెల్‌ 36 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.

అయితే పావెల్‌ను ఔట్‌ చేసి ఖలీల్‌ ఈ జోడీని విడదీశాడు. అనంతరం కెరీర్‌లో 200వ వన్డే బరిలోకి దిగిన మార్లోన్‌ శామ్యూల్స్‌ (0)కు మ్యాచ్‌ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. విండీస్‌ స్కోరు 86/3 వద్ద బ్యాటింగ్‌కు వచ్చిన హెట్‌మైర్‌ అనూహ్యంగా చెలరేగిపోయాడు. జడేజా బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన అతను షమీ ఓవర్లో వరుసగా 6, 4 బాదాడు. 41 బంతుల్లో అతని హాఫ్‌ సెంచరీ పూర్తయింది. హెట్‌మైర్, రావ్‌మన్‌ పావెల్‌ (22) కలిసి ఐదో వికెట్‌కు 74 పరుగులు జత చేసిన తర్వాత జడేజా భారత్‌కు వికెట్‌ అందించాడు.

అయితే ఆ తర్వాత కూడా కెప్టెన్‌ హోల్డర్‌ (42 బంతుల్లో 38; 5 ఫోర్లు) సహకారంతో హెట్‌మైర్‌ జోరు కొనసాగింది. షమీ బౌలింగ్‌లో కవర్స్‌ వైపు సిక్సర్‌ కొట్టి హెట్‌మైర్‌ 74 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. అయితే తర్వాతి ఓవర్లోనే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అతను వెనుదిరిగాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే నర్స్‌ (2), హోల్డర్‌ వికెట్లు చేజార్చుకున్నా... తొమ్మిదో వికెట్‌కు రోచ్‌ (26 నాటౌట్‌), బిషూ (22 నాటౌట్‌) నెలకొల్పిన 44 పరుగుల అభేద్య భాగస్వామ్యం విండీస్‌ స్కోరును 300 పరుగులు దాటించింది. చివరి పది ఓవర్లలో ఆ జట్టు 68 పరుగులు చేసింది. ఈ ఏడాది జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ కుల్దీప్‌ కాకుండా పేసర్‌ ఖలీల్‌ను ఎంచుకున్న టీమిండియా మేనేజ్‌మెంట్‌ నిర్ణయం ఆశ్చర్యపరచింది.  

నంబర్‌వన్‌ జోడి...
తన తొలి ఓవర్లోనే శిఖర్‌ ధావన్‌ (4)ను క్లీన్‌బౌల్డ్‌ చేసిన అరంగేట్ర బౌలర్‌ ఒషాన్‌ థామస్‌ సంబరాలు... అంతే, ఇది మినహా వెస్టిండీస్‌ ఆ తర్వాత చేసేందుకు ఏమీ లేకపోయింది. కోహ్లి, రోహిత్‌ల దూకుడు ముందు ఆ జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. మొదటి వికెట్‌ పడిన తర్వాత ఎదురుదాడికి దిగిన కోహ్లి తాను క్రీజ్‌లో ఉన్నంత వరకు అదే దూకుడు కొనసాగించాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన రోహిత్‌ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వీరిద్దరి ధాటికి పరుగులు వరదలా రాగా... విండీస్‌ బౌలర్లు బేలగా చూస్తుండిపోయారు.

భారత బ్యాట్స్‌మెన్‌ అద్భుత బ్యాటింగ్‌కు తోడు ప్రత్యర్థి పేలవ బౌలింగ్‌ టీమిండియా లక్ష్యాన్ని తొందరగా చేరేలా చేసింది. థాంప్సన్‌ వరుస ఓవర్లలో రెండేసి ఫోర్లు బాదిన కోహ్లి, హోల్డర్‌ ఓవర్లోనూ మరో రెండు ఫోర్లు కొట్టి 35 బంతుల్లోనే అర్ధ సెంచరీని అందుకున్నాడు. మరోవైపు అప్పటి వరకు సహాయక పాత్రలో నిలిచిన రోహిత్‌ ఒక్కసారిగా జూలు విదిల్చాడు. బిషూ ఓవర్లో వరుస బంతుల్లో భారీ సిక్సర్లు బాది తాను సీన్‌లోకి వచ్చేశాడు. రోచ్‌ బౌలింగ్‌లో కవర్‌ డ్రైవ్‌తో సాధించిన ఫోర్‌తో 88 బంతుల్లో కోహ్లి శతకం పూర్తయింది.

రోచ్‌ తర్వాతి ఓవర్లో కోహ్లి ఫోర్, సిక్స్‌... రోహిత్‌ రెండు ఫోర్లు కొట్టడంతో మొత్తం 19 పరుగులు లభించాయి. నర్స్‌ ఓవర్లో కూడా భారత్‌ ఇలాగే మరో 19 పరుగులు రాబట్టింది. ఇదే ఓవర్లో ఫోర్‌తో 84 బంతుల్లో రోహిత్‌ సెంచరీని చేరుకున్నాడు. ఎట్టకేలకు బిషూ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయి కోహ్లి స్టంపౌంట్‌ కావడంతో అద్భుత భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత రాయుడు (22 నాటౌట్‌)తో కలిసి రోహిత్‌ మరో 7.5 ఓవర్లు మిగిలి ఉండగానే మిగతా పనిని పూర్తి చేశాడు.  బిషూ బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో 150 పరుగుల మార్క్‌ను దాటిన రోహిత్‌ మ్యాచ్‌నూ ముగించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు అభేద్యంగా 70 పరుగులు జత చేశారు.

సాధికారిక విజయం తర్వాత చాలా సంతోషంగా ఉంది. వెస్టిండీస్‌ చాలా బాగా బ్యాటింగ్‌ చేసింది. 320 పరుగులకు పైగా ఛేదన అంటే ఎప్పుడూ అంత సులువు కాదు. అయితే ఒక భారీ భాగస్వామ్యం చాలనే విషయం తెలుసు. మరో ఎండ్‌లో రోహిత్‌ శర్మ ఉన్నాడంటే మన పని ఎప్పుడూ సులువే. టాప్‌–3లో రోహిత్‌ సహాయక పాత్ర పోషించడం చాలా అరుదు. సాధారణంగా నేను ఆ పని చేస్తుంటాను. ఈ రోజు నేను నడిపించే బాధ్యత తీసుకుంటానని రోహిత్‌కు చెప్పేశాను. నేను ఔటయ్యాక అతనూ అదే పని చేశాడు. రోహిత్‌తో కలిసి ఆడటం చాలా బాగుంటుంది. ఇది మా ఐదో డబుల్‌ సెంచరీ భాగస్వామ్యం. ఆటను ఆస్వాదించేందుకు నా కెరీర్‌లో మరికొన్నేళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. దేశం తరఫున ఆడటం గర్వకారణం కాబట్టి ఏ మ్యాచ్‌ను కూడా తక్కువగా చూడరాదు.
–విరాట్‌ కోహ్లి   

► భారత్‌ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన 224వ క్రికెటర్‌గా రిషభ్‌ పంత్‌ గుర్తింపు పొందాడు. ఆదివారం జరిగిన వన్డేలో మాజీ కెప్టెన్‌ ధోని చేతుల మీదుగా రిషభ్‌ పంత్‌ క్యాప్‌ను అందుకున్నాడు.   

► 36: వన్డేల్లో కోహ్లి సెంచరీల సంఖ్య. ఈ జాబితాలో సచిన్‌ (49) మాత్రమే అతనికంటే ముందున్నాడు. కెప్టెన్‌గా కోహ్లికిది 14వ సెంచరీ. పాంటింగ్‌ (22) తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఛేదనలో 22వ శతకం బాదిన కోహ్లి... ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో 60వ సెంచరీ నమోదు చేశాడు.  

► 20: వన్డేల్లో రోహిత్‌ శర్మ సెంచరీల సంఖ్య. భారత్‌ తరఫున సచిన్‌ (49), కోహ్లి (36), గంగూలీ (22) తర్వాత అతను నాలుగో స్థానంలో ఉన్నాడు. రోహిత్‌ వన్డేల్లో ఆరు సార్లు 150కి పైగా స్కోర్లు సాధించాడు. గతంలో సచిన్, వార్నర్‌ ఐదేసిసార్లు ఈ ఘనత సాధించారు. 2017 చాంపియన్స్‌ ట్రోఫీ నుంచి రోహిత్‌ వరుసగా 9 వన్డే సిరీస్‌లలో  సెంచరీ సాధించడం విశేషం.  

► 3: వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత క్రికెటర్ల జాబితాలో సౌరవ్‌ గంగూలీ (190)ను వెనక్కి నెట్టి రోహిత్‌ శర్మ (194) మూడో స్థానానికి చేరాడు. మహేంద్ర సింగ్‌ ధోని (217), సచిన్‌ టెండూల్కర్‌ (195) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.   

స్కోరు వివరాలు
వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: కీరన్‌ పావెల్‌ (సి) ధావన్‌ (బి) అహ్మద్‌ 51; హేమ్‌రాజ్‌ (బి) షమీ 9; షై హోప్‌ (సి) ధోని (బి) షమీ 32; శామ్యూల్స్‌ (ఎల్బీ) (బి) చహల్‌ 0; హెట్‌మైర్‌ (సి) పంత్‌ (బి) జడేజా 106; రావ్‌మన్‌ పావెల్‌ (బి) జడేజా 22; హోల్డర్‌ (బి) చహల్‌ 38; నర్స్‌ (ఎల్బీ) (బి) చహల్‌ 2; బిషూ (నాటౌట్‌) 22; కీమర్‌ రోచ్‌ (నాటౌట్‌) 26; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 322.  
వికెట్ల పతనం: 1–19; 2–84; 3–86; 4–114; 5–188; 6–248; 7–252; 8–278.
బౌలింగ్‌: షమీ 10–0–81–2; ఉమేశ్‌ 10–0–64–0; ఖలీల్‌ అహ్మద్‌ 10–0–64–1; చహల్‌ 10–0–41–3; జడేజా 10–0–66–2.  
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (నాటౌట్‌) 152; ధావన్‌ (బి) థామస్‌ 4; కోహ్లి (స్టంప్డ్‌) హోప్‌ (బి) బిషూ 140; అంబటి రాయుడు (నాటౌట్‌) 22; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (42.1 ఓవర్లలో 2 వికెట్లకు) 326.  
వికెట్ల పతనం: 1–10; 2–256.
బౌలింగ్‌: కీమర్‌ రోచ్‌ 7–0–52–0; థామస్‌ 9–0–83–1; హోల్డర్‌ 8–0–45–0; నర్స్‌ 7–0–63–0; బిషూ 10–0–72–1; హేమ్‌రాజ్‌ 1.1–0–9–0. 


హెట్‌మైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement