మాక్సిమ్ డడ్‌షెవ్
మాస్కో: రింగ్‌లో ప్రత్యర్థి పిడిగుద్దులు ఓ యువ బాక్సర్ ఉసురు తీశాయి. ప్రొఫెషనల్ ఆటలో భౌతిక దాడి స్థాయిలో విసిరిన పంచ్‌లు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. ఈ విషాద ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాలు... మేరీలాండ్ పరిధి అక్సన్ హిల్‌లో గత శుక్రవారం రాత్రి మాక్సిమ్ డడ్‌షెవ్ (రష్యా), సుబ్రియెల్ మటియాస్ (ప్యూర్టోరికో) మధ్య ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య (ఐబీఎఫ్) సూపర్ లైట్ వెయిట్ విభాగంలో బౌట్ జరిగింది. ఇందులో మటియాస్ వరుసగా విసిరిన పంచ్‌ల ధాటికి 28 ఏళ్ల డడ్‌షెవ్ దిమ్మతిరిగింది.
డ్రెస్సింగ్ రూమ్ వరకు సైతం నడవలేని పరిస్థితుల్లో ఉన్న అతడిని హుటాహుటిన వాషింగ్టన్‌లోని ఆస్పత్రిలో చేర్చారు. మెదడులో అంతర్గతంగా తీవ్ర రక్తస్రావం కావడంతో చిక్సిత పొందుతూ మంగళవారం మృతి చెందాడు. డడ్‌షెవ్ తాను తలపడిన గత 13 బౌట్లలో అజేయంగా నిలిచాడు. శుక్రవారం నాటి పోరులో మాత్రం మటియాస్ ముందు నిలవలేకపోయాడు. ఆరంభం నుంచే దూకుడు చూపిన మటియాస్... ప్రత్యర్థి తప్పించుకోలేనంతగా బలమైన పంచ్‌లు విసిరాడు. వీటికి డడ్‌షెవ్ తాళలేకపోయాడు.
11వ రౌండ్ తర్వాత కుప్పకూలిన అతడు గ్లోవ్స్ చాటున తలదాచుకుంటూ ‘ఇక ఆపదల్చుకున్నాను’ అని సంకేతాలిచ్చాడు. కానీ, అప్పటికే నష్టం జరిగిపోయింది. ఆస్పత్రిలో అత్యవసర వార్డులో చేర్చి చికిత్స చేసినా ప్రాణం దక్కలేదు. దీనిపై కార్నర్‌మన్ మెక్‌గ్రిట్ మాట్లాడుతూ... బౌట్‌ను ఆపేలా డడ్‌షెవ్‌ను ఒప్పించలేకపోయానని అంటున్నాడు. మరోవైపు రష్యా బాక్సింగ్ సమాఖ్య ఈ బౌట్‌పై విచారణ జరుపుతోంది. ఈ బౌట్‌లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఉమర్ క్రెమ్లెవ్ ఆరోపించాడు. డడ్‌షెవ్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. అతడి కుటుంబాన్ని ఆదుకుంటామని ఉమర్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment