సచిన్ నామస్మరణే...
ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆఖరి టెస్టు కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) భారీగా సన్నాహాలు చేస్తోంది. ఈ దిగ్గజ ఆటగాడి 24 ఏళ్ల కెరీర్‌కు ఘనమైన రీతిలోనే వీడ్కోలు పలకాలని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా స్టేడియంలో ఎటు చూసినా సచిన్ కనిపించే విధంగా కటౌట్లు... అలాగే సచిన్ తల్లి స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వాంఖడేలో జరిగే తన 200వ టెస్టు కోసం జరుగుతున్న సన్నాహకాల్లో మరికొన్ని...
స్టేడియం చుట్టూ ‘సచిన్’: మాస్టర్ క్రికెట్ ఆరంభించిన తొలినాళ్ల నుంచి ఇప్పటిదాకా రకరకాల ఫొటోలను వాంఖడే చుట్టూ కటౌట్లుగా ఏర్పాటు చేయనున్నారు. దీంతో అభిమానులకు సర్వం సచిన్‌మయం అనే రీతిలో స్టేడియం కనువిందు చేయనుంది.
టిక్కెట్లపై ‘సచిన్’: వాంఖడే టెస్టు కోసం అమ్మే టిక్కెట్లపై సచిన్ ఫొటోను ముద్రించనున్నారు. అలాగే టెస్టుల్లో చేసిన 51 సెంచరీల వివరాలు కూడా పొందుపరుస్తారు.
500 టిక్కెట్లు సచిన్ కోసమే: చివరి టెస్టును చూసేందుకు తన ఆత్మీయులను సచిన్ ఆహ్వానిస్తున్నాడు. దీని కోసం 500 టిక్కెట్లు కావాలని ఎంసీఏను కోరాడు. మాస్టర్ వినతిని అంగీకరించిన ఎంసీఏ పెవిలియన్‌లో 200, నార్త్ స్టాండ్‌లో 300 టిక్కెట్లను కేటాయించింది.
తల్లి కోసం ప్రత్యేక ఏర్పాట్లు: 24 ఏళ్ల కెరీర్‌లో సచిన్ వందలాది వన్డేలు.. రికార్డు టెస్టులు ఆడినప్పటికీ ఇప్పటిదాకా అతడి తల్లి రజనీ మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ప్రత్యక్షంగా వీక్షించింది లేదు. అయితే తన కుమారుడు చివరిసారిగా ఆడబోతున్న టెస్టును ‘తొలిసారిగా’ చూసేందుకు మాత్రం ఈసారి వాంఖడేకు రావాలని భావిస్తున్నారు.
ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతూ వీల్‌చెయిర్‌కే పరిమితమైన ఆమె రాక కోసం స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా తన తల్లికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే సచిన్ అధికారులను కలిసి పలు సూచనలు చేశాడు. ప్రెసిడెంట్ బాక్స్‌కు వెళ్లే ప్రవేశ ద్వారం వద్ద ర్యాంప్‌ను ఏర్పాటు చేయాలని చెప్పాడు.
బహుమతిగా ముఖచిత్రం: వీడ్కోలు బహుమతిగా ఎంసీఏ మాస్టర్‌కు అతడి పెయింటింగ్‌నే బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు ఇది ఏరకంగా ఉండాలో తెలుసుకునేందుకు ఆర్టిస్టును సచిన్ ఇంటికి పంపింది.
క్లబ్‌కు సచిన్ పేరు: తమ రాష్ట్రానికి చెందిన సచిన్ పేరు స్థిరస్థాయిగా నిలిచిపోయేలా ఎంసీఏకు చెందిన కాందివలీ క్లబ్‌కు సచిన్ టెండూల్కర్ జింఖానా క ్లబ్‌గా నామకరణం చేశారు.
11న సచిన్‌కు సన్మానం
ముంబై: సచిన్ టెండూల్కర్‌కు ముంబై క్రికెట్ అసోసియేషన్ నవంబర్ 11న సన్మానం చేయనుంది. ‘కాందివలీ క్లబ్ హౌజ్‌కు సచిన్ పేరును పెడుతున్నాం. ఆవిష్కరణ కార్యక్రమం వచ్చే నెల 11న జరుగుతుంది. అదే రోజు సచిన్‌కు సన్మానం జరపాలని నిర్ణయించాం. కోల్‌కతా నుంచి ముంబైలో అడుగుపెట్టే భారత్, వెస్టిండీస్ జట్లు నేరుగా ఈ కార్యక్రమానికి హాజరై ఆ తర్వాత తమ హోటళ్లకు వెళతాయి. మహారాష్ర్ట సీఎం పృధ్వీరాజ్ చౌహాన్, బోర్డు అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్, ఇతర అధికారులు, ముంబైకి చెందిన మాజీ ఆటగాళ్లు కూడా పాల్గొంటారు. అలాగే 14న మ్యాచ్ జరిగే పది నిమిషాల ముందు బీసీసీఐ కూడా సచిన్‌ను సన్మానించనుంది’ అని ఎంసీఏ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు.