
ముంబై: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటను తాను ఎంతగానో ఇష్టపడతానని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల‍్కర్ స్పష్టం చేశాడు. ప్రధానంగా కోహ్లి కొట్టే కవర్ డ్రైవ్స్‌కు తాను పెద్ద అభిమానినని సచిన్ తెలిపాడు. తాను పోలికల్ని అస్సలు ఇష్టపడనని తెలిపిన సచిన్.. ఇప్పటివరకూ కోహ్లి సాధించిన ఘనతలు అసాధారణమన్నాడు.
‘ ఒక్కో క్రికెటర్ ఏదొక షాట్‌తో ప‍్రత్యేకతను తెచ్చుకుంటాడు. ఇక్కడ విరాట్ కోహ్లి వరకూ వస్తే అతను కొట్టే కవర్ డ్రైవ్స్ చాలా అందంగా ఉంటాయి. ఆ షాట్‌లకు నేను పెద్ద అభిమానిని. కోహ్లిని ఎవరితోనూ పోల్చలేం’ అని సచిన్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన భారత్‌కు చాలా ముఖ్యమైనదిగా సచిన్ అభిప్రాయపడ్డాడు. ప్రధానంగా ఆసీస్ టూర్ కోహ్లికి పెద్ద సవాల్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ఆసీస్ ఎప్పటికీ కఠినమైన ప‍్రత్యర్థిగా పేర్కొన్న సచిన్.. వారి బ్యాటింగ్ లోతును అంచనా వేయడం కష్టమన్నాడు. ఈ క్రమంలోనే ఆసీస్‌తో భారత్‌కు గట్టి పోటీ ఉంటుందన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా విజయవంతమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నాడు. ప‍్రస్తుత భారత జట్టు సమతూకంగా ఉన్న విషయాన్ని సచిన్ మరోసారి ప్రస్తావించాడు.