
నాగ్‌పూర్: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ప్రపంచ 16వ ర్యాంకర్, మూడో సీడ్ సాయిప్రణీత్‌కు చుక్కెదురైంది. పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ హైదరాబాద్ ప్లేయర్ సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 21–13, 18–21, 20–22తో క్వాలిఫయర్ శుభాంకర్ డే (రైల్వేస్) చేతిలో ఓడిపోయాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో శ్రీకాంత్ (పీఎస్‌పీబీ) 21–17, 23–21తో శుభమ్ ప్రజాపతి (మధ్యప్రదేశ్)పై, ప్రణయ్ (పీఎస్‌పీబీ) 22–20, 21–19తో కశ్యప్ (పీఎస్‌పీబీ)పై గెలుపొందారు.
సెమీస్‌లో సింధు, సైనా: మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు (ఆంధ్రప్రదేశ్), రుత్విక శివాని (పీఎస్‌పీబీ), సైనా (పీఎస్‌పీబీ), అనురా (ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా–ఏఏఐ) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో సింధు 21–11, 21 – 17తో శ్రేయాన్షి (మధ్యప్రదేశ్)పై, రుత్విక 21–14, 21–8తో సాయి ఉత్తేజిత రావు (ఏఏఐ)పై, అనురా 21–19, 21–9తో శైలి రాణే (రైల్వేస్)పై, సైనా 21 – 17, 21–10తో ఆకర్షి కశ్యప్ (ఏఏఐ)పై గెలిచారు.