ర్యాంక్తో పాటు బ్రాండ్ వాల్యూ పెరిగింది
మేజర్ టోర్నీలన్నింటిలో సత్తా చాటుతున్న భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్కు.. ర్యాంక్ తో పాటు బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగింది. ఇటీవల విజయాలతో ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్న ఈ బ్యాడ్మింటన్ స్టార్.. పెద్ద సంఖ్యలో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోంది.
ఓ వ్యాపార ప్రకటన కోసం 12కోట్ల రూపాయల ఒప్పందం సైనాను వరించింది. ఏడాదికి 4 కోట్ల రూపాయలు ఆమెకు ఇవ్వనున్నారు. టాప్ క్రికెటర్ల తర్వాత ఇంత భారీ మొత్తానికి డీల్ కుదుర్చుకున్న తొలి క్రీడాకారిణి సైనానే కావడం విశేషం. ధోనీ, విరాట్ కొహ్లీ వంటి స్టార్ క్రికెటర్లకు మాత్రమే ఇలాంటి ఒప్పందాలు వస్తాయవని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్ వర్గాల కథనం మేరకు ధోనీ ఒక బ్రాండ్ ప్రచారం కోసం ఏడాదికి 8 నుంచి 10 కోట్లు తీసుకుంటుండగా.. విరాట్ కొహ్లీ 6-7 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
రాబోయే మూడేళ్లలో సైనా ఎండార్స్మెంట్ల ద్వారా భారీ మొత్తంలో డబ్బు ఆర్జించనుంది. నిన్న మొన్నటి వరకూ దాదాపు 10 ఎండార్స్ మెంట్స్ ద్వారా ఏడాదికి 5 నుంచి 7 కోట్ల రూపాయలు సంపాదిస్తున్న సైనా బ్రాండ్ వాల్యూ ఇటీవల అనూహ్యంగా పెరిగింది. హెర్బల్ లైఫ్, స్టార్ స్పోర్ట్స్, గోద్రేజ్, ఇమానీ, సహారా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐయోడెక్స్ వంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న సైనా.. ఎడెల్ వీస్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనుంది.
మరో వైపు ఈ ప్రపంచ నెంబర్ వన్ షట్లర్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్లాన్ చేస్తోంది. ప్రైజ్ మనీ, వాణిజ్య ఒప్పందాల ద్వారా వచ్చిన డబ్బుతో బిజినెస్ చేయాలని యోచిస్తోంది. అయితే తనకు బ్యాడ్మింటన్ తప్ప మరో విషయం తెలియదని.. వ్యాపార విషయాలన్నీ తన తండ్రి చూసుకుంటారని వివరించింది. తాను డబ్బుల గురించి ఆలోచించనని.. తన దృష్టి అంతా ఆటమీదే ఉందని చెప్పింది.