
'అతడి కారణంగానే ఓడిపోయాం'
బెంగళూరు: యువ బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ కారణంగానే ఐపీఎల్ -9 తొలి మ్యాచ్ లో తాము ఓడిపోయామని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. చివరి ఓవర్లలో విజృభించి ఆడి సర్ఫరాజ్ తమ నుంచి మ్యాచ్ ను లాగేసుకున్నాడని పేర్కొన్నాడు. అతడు చేసిన పరుగులే మ్యాచ్ లో కీలకంగా మారాయని చెప్పాడు. చివరి రెండు ఓవర్లలో మ్యాచ్ స్వరూపం మారిపోయిందన్నాడు. విరాట్ కోహ్లి, డివిలియర్స్ కూడా గొప్ప ఇన్నింగ్స్ ఆడారని మెచ్చుకున్నాడు.
గతి తప్పి చెత్త బంతులు వేసిన బౌలర్లతో తాను మాట్లాడకపోవడం కూడా ఓటమి కారణమని చెప్పాడు. సీనియర్ బౌలర్ ఆశిష్ నెహ్రా గాయపడం కూడా తమపై ప్రతికూల ప్రభావం చూపిందని వాపోయాడు. ఓటమికి తాను ఏ ఒక్కరిని తప్పు బట్టడం లేదని, లోపాలను సరిదిద్దుకుని తర్వాతి మ్యాచ్ లో బరిలోకి దిగుతామని వార్నర్ తెలిపాడు.