
అలవోక గెలుపుతో న్యూజిలాండ్ పర్యటనలో శుభారంభం చేసిన టీమిండియా... ఆ ఊపును రెండో మ్యాచ్‌లోనూ కొనసాగించేందుకు సమాయత్తం అవుతోంది. అటు బౌలర్లు, ఇటు బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించడంతో కోహ్లి సేన ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. తొలి వన్డేలో స్పిన్నర్ల ప్రతాపాన్ని రుచి చూసిన ఆతిథ్య న్యూజిలాండ్... ఆ మేరకు తమ కూర్పులో మార్పుతో బరిలో దిగనుంది. ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలని భారత్ భావిస్తుండగా... సొంతగడ్డపై పట్టు జారకుండా చూసుకునే ప్రయత్నంలో కివీస్ ఉంది.
మౌంట్ మాంగనీ: సాదాసీదాగా సాగి... తక్కువ స్కోర్లతో అభిమానులను నిరుత్సాహపరిచింది తొలి వన్డే. అయితే, పరుగుల వరద పారే పిచ్‌తో ఆ లోటును సంపూర్తిగా తీర్చేందుకు సిద్ధమైంది మౌంట్ మాంగనీలోని మైదానం. ఈ నెల ప్రారంభంలో ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల స్కోర్లను పరిశీలిస్తే... భారత్, న్యూజిలాండ్ మధ్య శనివారం నాటి రెండో వన్డే ప్రేక్షకులను కనువిందు చేయనుండటం ఖాయంగా కనిపిస్తోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా గత మ్యాచ్ జట్టునే కొనసాగించనుండగా, న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌతీ స్థానంలో స్పిన్నర్ ఇష్ సోధిని ఆడించే అవకాశం కనిపిస్తోంది. మంచి బ్యాట్స్‌మెన్ ఉన్నప్పటికీ నేపియర్‌లో తడబడి కుప్పకూలిన కివీస్... ఈసారి భారత బౌలర్లను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
మార్పేమీ లేకుండా...
ఆస్ట్రేలియాతో చివరి వన్డేకు తప్పించిన అంబటి రాయుడును అనూహ్యంగా న్యూజిలాండ్‌తో తొలి వన్డే ఆడించారు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బదులు కుల్దీప్‌ను ఎంచుకున్నారు. ఈ అవకాశాన్ని కుల్దీప్ ఉపయోగించుకున్నాడు. ఇక రాయుడిపై మరోసారి నమ్మకం ఉంచుతూ మార్పుల్లేకుండా రెండో వన్డే ఆడనుంది టీమిండియా. మరోవైపు ఓపెనర్లలో ధావన్ ఫామ్‌లోకి రావడం శుభపరిణామం. 4, 5 వన్డేలు, టి 20 సిరీస్‌కు సారథ్యం చేపట్టనున్నందున ఓపెనర్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో రాణించాల్సిన అవసరం ఉంది. ఆసీస్‌పై తొలి వన్డేలో సెంచరీ తర్వాత అతడు మళ్లీ స్థాయికి తగిన ఇన్నింగ్స్ ఆడలేదు. ఇక్కడి బ్యాటింగ్ పిచ్‌పై వీరిద్దరూ మంచి ప్రారంభం ఇస్తే... కెప్టెన్ విరాట్ కోహ్లి సహా తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్ దానిని మరింత పైకి తీసుకెళ్లే వీలుంటుంది. పేసర్ మొహమ్మద్ షమీ బౌలింగ్ పదునేంటో నేపియర్‌లో కివీస్‌కు తెలిసొచ్చింది. అతడితో పాటు భువనేశ్వర్‌ను ప్రత్యర్థి ఎదుర్కొనలేకపోయింది. వీరితో పాటు కుల్దీప్, యజువేంద్ర చహల్ మణికట్టు స్పిన్ మాయతో చుట్టేస్తే ఆతిథ్య జట్టుకు ఇక్కట్లు తప్పవు.
స్పిన్నర్‌కు అవకాశం
ఫ్లాట్ పిచ్‌పై ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే తొలి వన్డేలో కివీస్ కుప్పకూలింది. సొంతగడ్డపై చెలరేగుతారని ఊహించిన బ్యాట్స్‌మెన్ కనీస స్కోర్లూ చేయకలేకపోయారు. కెప్టెన్ విలియమ్సన్ ఒక్కడే పోరాడాడు. రెండో వన్డేలో భారత బౌలింగ్ దళానికి విధ్వంసక గప్టిల్, మున్రో, రాస్ టేలర్, నికోల్స్ ఎలా జవాబిస్తారో చూడాలి. నలుగురు పేసర్లతో బరిలో దిగినా, స్కోరు బోర్డుపై పెద్దగా పరుగులు లేకపోవడంతో వారు చేసేదేమీ లేకపోయింది. భారత స్పిన్నర్ల బౌలింగ్ తీరు చూశాక పొరపాటును గ్రహించినట్లుంది. దీంతో శనివారం మ్యాచ్‌కు సౌతీని తప్పించి స్పిన్నర్ సోధిని ఆడించనుంది. ఏదేమైనా బ్యాట్స్‌మెన్ రాణింపుపైనే న్యూజిలాండ్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
పిచ్, వాతావరణం
మౌంట్ మాంగనీ పిచ్ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలం. ఇటీవల న్యూజిలాండ్–శ్రీలంక మధ్య ఇక్కడ జరిగిన రెండు వన్డేల్లోనూ పరుగులు పోటెత్తాయి. తొలుత పేసర్లకు అనుకూలించినా, మ్యాచ్ సాగేకొద్దీ వారి ప్రభావమూ నామమాత్రమే అవుతుంది.
►ఈ మైదానంలో భారత్, కివీస్ తొలిసారి తలపడనున్నాయి. న్యూజిలాండ్ మాత్రం ఈ వేదికపై ఆరు మ్యాచ్‌లు ఆడింది. మూడింటిలో గెలిచి, మరో మూడింటిలో ఓడిపోయింది.
తుది జట్లు అంచనా
భారత్: రోహిత్, ధావన్, కోహ్లి (కెప్టెన్), రాయుడు, ధోని, జాదవ్, శంకర్, కుల్దీప్, చహల్, భువనేశ్వర్, షమీ.
న్యూజిలాండ్: గప్టిల్, మున్రో, విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, లాథమ్, నికోల్స్, సాన్‌ట్నర్, సౌతీ/సోధి, ఫెర్గూసన్, బ్రాస్‌వెల్, బౌల్ట్.
► ఉదయం 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం